Actor Prithviraj: కమెడియన్ పృథ్వీరాజ్‌కు బిగ్‌ షాక్‌.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ! ఏం జరిగిందంటే..

www.mannamweb.com


ప్రముఖ టాలీవుడ్ కమెడియన్‌ నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ కోర్టు షాకిచ్చింది. తాజాగా పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మిప్రతినెలా మనోవర్తి చెల్లించాలంటూ గతంలోనే కోర్టు ఆదేశించినా భేఖాతరు చేయడంతో.. ఆమె మళ్లీ కోర్టు తలుపు తట్టింది. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కానందున నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను కోర్టు బుధవారం జారీ చేసింది.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్‌కు విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం సజవుగా సాగిన వీరికాపురంలో మనస్పర్ధలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. భార్య శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉండసాగింది. భర్త నుంచి తనకు నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలంటూ శ్రీలక్ష్మి 2017లో కోర్టును ఆశ్రయించింది. తన వివాహం అనంతరం విజయవాడలో తన పుట్టింట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించేవాడని, ఆసమయంలో అతని ఖర్చులన్నీ తమ పుట్టించివాళ్లే భరించారని ఆమె కోర్టుకు తెలిపింది. ఇక సినిమాల్లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయిన ఆయన తనను తరచూ వేధించేవాడని కోర్టుకు విన్నవించింది. 2016 ఏప్రిల్‌ 5న ఇంట్లో నుంచి తనను వెళ్లగొట్టాడని, దీంతో అప్పటి నుంచి తన పుట్టింటిలోనే ఉంటున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా నెలకు రూ.30 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు అందులో తెలిపింది. భర్త నుంచి తనకు నెలకు రూ.8 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.

దీనిని 2017 జనవరి 10న విచారించిన కోర్టు.. పృథ్వీరాజ్‌ తన భార్యకు నెలకు రూ.8 లక్షల భరణంతోపాటు.. కేసు దాఖలు చేసినప్పటి నుంచి అయిన ఖర్చులు కూడా ఆయనే ఇవ్వాలని తీర్పునిచ్చింది. ప్రతి నెలా 10వ తేదీ నాటికి భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించడంతో పృథ్విరాజ్‌ హైకోర్టులో దీనిని సవాలు చేశాడు. కేసు వివరాలను పరిశీలించిన హైకోర్టు నెలకు రూ.22 వేలు చెల్లించాలని, అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అయితే శ్రీలక్ష్మీకి భరణం చెల్లించడంతో పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. పైగా కోర్టుకు కూడా హాజరుకావడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో మరోమారు భార్య శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేయడంతో.. విజయవాడ ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పృథ్వీరాజ్ పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కుపోయినట్లైంది.