స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మూడు నెలల కాలంలో అంచనాలకు మించిన లాభాల పెరుగుదలను చవి చూసింది. ముఖ్యంగా నికర లాభం 28 శాతం పెరిగింది. దేశంలోని ప్రజల ఆదరాభిమానాలు పొందిన బ్యాంకులలో స్టేట్ బ్యాంకు (ఎస్ బీఐ) ఒక్కటి.
పల్లెల నుంచి పట్టణాల వరకూ దీనికి బ్రాంచ్ లున్నాయి. అలాగే సామాన్య ప్రజలకు సైతం ఈ బ్యాంకు బాగా దగ్గరైంది. కాగా. ఎస్ బీఐ 2024-25 ఆర్ఠిక సంవత్సరంలోని రెండో త్రైమాసికానికి (జూలై – సెప్టెంబర్) సంబంధించిన ఫలితాలను వెల్లడించింది. వాటి ప్రకారం లాభాలలో గణనీయమైన పురోగతి కనిపించింది. అంచనాలకు మించి ఆదాయాన్ని సంపాదించింది. స్టాండలోన్ ప్రతిపదికను నికర లాభం 27.92 శాతం పెరిగి, రూ.18,331 కోట్లకు చేరింది.
గతేడాది ఇదే సమయంలో ఈ ఆదాయం రూ.14,331 కోట్లు మాత్రమే ఉంది. సెప్టెంబర్ లో ముగిసిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయమే రూ.41,620 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సమయానికి రూ.39,500 కోట్ల మాత్రమే నమోదైంది. ఈ నేపథ్యంలో 5.37 శాతం ఆదాయం పెరిగింది.స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు సంబంధించి ఆపరేటింగ్ ప్రాఫిట్ జూలై – సెప్టెంబర్ లో 29.294 కోట్లకు చేరింది. గతంతో పోల్చితే 51 శాతం పెరిగింది. అంతకు ముందు ఈ మొత్తం 19,417గా ఉండేది. అయితే బ్యాంకు డిపాజిట్లు మాత్రం ఇదే సమయంతో పోల్చితే 9 శాతం తగ్గగా, వీటి విలువ రూ.51.17 లక్షల కోట్లుగా నమోదైంది.
బ్యాంకు కు చెందిన అనుబంధ సంస్థలకు సంబంధించి జీవిత బీమా విభాగ నికర లాభం ప్రథమార్థంలో రూ.1049 కోట్లు, క్రెడిట్ కార్డు విభాగంలో రూ.999 కోట్లు, ఫండ్ నిర్వహణ విభాగంలోరూ.1374 కోట్లు, సాధారణ బీమాకు సంబంధించి రూ.414 లాభాలు వచ్చాయి. గతేడాది ఇదే సమయానికి వీటి లాభాలు రూ761 కోట్లు, రూ.1196 కోట్లు, 940 కోట్లు, 60 కోట్లు మాత్రేమే ఉన్నాయి. బ్యాంకు చైర్మన్ సి.శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రుణవృద్ధి లక్ష్యాన్ని 14 నుంచి 16శాతం కొనసాగిస్తున్నామన్నారు. డిపాజిట్ల వృద్ధి లక్ష్యాన్ని మాత్రం 10 శాతానికి తగ్గించినట్టు వివరించారు. పండగల సమయంలో రిటైల్ రుణాలు పెరుగుతాయన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల లాభాన్ని సాధించాలని బ్యాంకు భావిస్తోందన్నారు.