దేశంలో బ్యాంక్ లావాదేవీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి.పండగల సీజన్ వేళ ఇ-కామర్స్ సంస్థలతో పాటు షాపింగ్ మాల్స్ ఇతర వ్యాపార సంస్థల్లో భారీ ఎత్తున డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ప్రకటిస్తుంటారు. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రానిక్ గూడ్స్, గృహోపకరణాలు, దుస్తులలై ప్రత్యేక ఆఫర్లు లభిస్తుంటాయి. తమకు కావాల్సిన వస్తువులపై ఒకేసారి మొత్తం చెల్లించాల్సిన పని ఉండదు కనుక ఈఎంఐకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే నో కాస్ట్ ఈఎంఐ లో వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లకు లాభమా? నష్టమా? అన్న విషయం గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..
పండుగల సందర్భంగా చాలా మంది కస్టమర్లు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, బట్టలు, గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే మార్కెట్ లో పలు వస్తువులపై భారీ ఆపర్లు కూడా ఉంటాయి.ఇటీవల చాలా మంది జీరో వడ్డీతో ఈఎంఐ చెల్లించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తమ బడ్జెట్ కి సరిపడ ఎక్కువ వస్తువులు తీసుకొని ఈఎంఐ పద్దతుల్లో చెల్లిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే మనం కొనుగోలు చేసే వస్తువు ధర మొత్తం ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవొచ్చు. జీరో వడ్డీతో నిర్ణీత వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నాయి పలు కంపెనీలు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ వస్తువపై వడ్డీ భారాన్ని మాత్రం రద్దు చేయరు.
పండగ సమాయాల్లో తయారీదారులు లేదా అమ్మకందారులు తమ వస్తువల అమ్మకాలు పెంచుకునేందుకు రక రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటారు.అయితే.. నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకున్న వారికి ఈ ప్రయోజనాలు ఉండవు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లో కొంటే ఆ వస్తువు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది.. ఆఫర్ ధర వర్తించదు. కొన్ని సందర్బాల్లో వడ్డీని సైతం వస్తువు ధరలో కలిపి ఈఎంఐ కింద కన్వర్ట్ చేస్తారు. కనుక నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే సమయంలో ఈ విషయాలు గమనించాలి. నో కాస్ట్ ఈఎంఐ ద్వారా వస్తువు కొంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందా? లేదా అన్న విషయం తెలుసుకోవాలి. కొన్నిసార్లు నో కాస్ట్ ఈఎంఐ కాల వ్యవధి తక్కువగా ఉంటుంది.. ఆ సమయంలో కట్టే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. సమయానికి వాయిదాలు చెల్లించలేకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అనవసరంగా పెనాల్టీలు, వడ్డీలు కట్టాల్సి ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే ముందు మన బడ్జెట్ ఎంత? సరైన సమయానికి వాయిదాలు చెల్లించగలమా? అనేది చూసుకోవాలి.
నెల వారీ చెల్లింపే కదా అని ఈజీగా తీసుకొని అనవసరమైన వస్తువులు కొని తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు.అలా చేస్తే నెల నెల చెల్లించే ఈఎంఐ భారం పెరిగి అప్పుల పాలవుతారు. అందుకే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ని ఎంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తుంటాయి..వడ్డీ భారాన్ని కూడా భరిస్తాయి. అలాంటి కంపెనీలు గురించి తెలుసుకొని వాటిని ఎంపిక చేసుకుంటే బెటర్ అంటున్నారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో పూర్తి వివరాలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్నిసార్లు లోన్ కి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజ్, డౌన్‌పేమెంట్ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. అది దాదాపు వస్తువుపై వడ్డీ రాబట్టడం లాంటిదే అంటున్నారు. వస్తువు కొనుగోలు చేసే సమయంలో ధరను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో సరిపోల్చుకొని నిర్ణయం తీసుకోవాలి. ఆ వస్తువు కొనుగోలు చేయడానికి నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకుంటే ప్రయోజనం ఉంటుందని భావిస్తే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.