వైఎస్ జగన్ కుటుంబంలో ఆస్తి పంపకాలు తెరపైకి వచ్చాయి. న్యాయపరంగా ముందుకెళ్లే దిశగా వైఎస్ జగన్ అడుగు ముందుకేశారు. సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లపై వివాదం నెలకొంది .
వైఎస్ షర్మిలపై జగన్ పిటిషన్
గత కొంతకాలంగా వైఎస్ ఫ్యామిలీలో విబేధాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా సోదరి వైఎస్ షర్మిల… కాంగ్రెస్ లోచేరారు. సోదరుడిపై తీవ్రస్థాయిలో రాజకీయపరంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆస్తి పంపకాలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే… తాజాగా ఓ కంపెనీ షేర్ల విషయంలో వివాదాలు తెరపైకి వచ్చాయి. ఏకంగా సోదరుడు వైఎస్ జగన్… నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి)లో కూడా పిటిషన్ వేశారు. దీంతో వైఎస్ ఫ్యామిలిలో విబేధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
NCLTలో జగన్ పిటిషన్…!
తన సోదరి వైఎస్ షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిలు పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల కేటాయింపుపై వివాదం నెలకొంది. దీంతో జగన్.. NCLTను ఆశ్రయించారు. సెప్టెంబర్ 10న ఎన్‌సిఎల్‌టిలో జాబితా చేయబడిన ఈ కేసు… కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద దాఖలు చేయబడింది.
ఈ కేసులో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల రెడ్డి, వైఎస్ విజయమ్మ, చగరి జనార్థన్ రెడ్డి, యశ్వనాథ్ రెడ్డి కేతిరెడ్డితో పాటు రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెన్స్ తెలంగాణ పేర్లను ప్రతివాదులుగా చేర్చారు.
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వృద్ధిలో తమ పాత్ర కీలకంగా ఉందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. షర్మిలకు వాటాలు కేటాయించేందుకు తాము 2019 ఆగస్టు 21న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేశామని తెలిపారు. అయితే… వాటా కేటాయింపు ఇప్పటికీ ఖరారు కాలేదని… ఇది ప్రస్తుత వివాదానికి దారి తీసిందని పిటిషన్ లో ప్రస్తావించారు.
తన సోదరి వైఎస్ షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామని జగన్ తన పిటిషన్ లో వివరించారు. అయితే ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని.. తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని ఎన్‌సీఎల్‌టీని జగన్, భారతి అభ్యర్థించారు.
పిటిషన్ ను స్వీకరించిన NCLT… ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 8, 2024కి షెడ్యూల్ చేసింది. ఈ కేసు దాఖలు నేపథ్యంలో… సరస్వతి పవర్ మరియు ఇండస్ట్రీస్‌పై మాత్రమే కాకుండా వైఎస్ కుటుంబంలోని విబేధాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయిందన్న చర్చ వినిపిస్తోంది.