సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీశైలం మీదుగా బుల్లెట్ ట్రైన్‌కు ప్రతిపాదన..

తెలుగు రాష్ట్రాల్లో బల్లెట్ రైలుకు సంబంధించి పలు కీలక మార్పులు జరగనున్నాయి. హైదరాబాద్‌ను చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించే ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టుల అలైన్‌మెంట్లలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖను కోరింది.


సెప్టెంబర్ 11న రైల్వే అధికారులతో జరిగిన మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ రెండు హైస్పీడ్ కారిడార్లకు కలిపి మొత్తం రూ. 3.30 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

హైదరాబాద్-చెన్నై మార్గం మార్పు

తెలంగాణ ప్రభుత్వం కోరిన ప్రధాన మార్పులు ఇవే:

రైల్వే ప్రతిపాదన: హైదరాబాద్‌ నుంచి విజయవాడ నేషనల్ హైవే మార్గంలో (నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం) మీదుగా చెన్నైకి.

ప్రభుత్వం కోరిన మార్పు: శంషాబాద్ నుంచి మిర్యాలగూడ వైపుగా అమరావతికి వేసే కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు పక్కనుంచి ఈ రైలు మార్గం ఉండాలి.

కొత్త హైవే పక్కనుంచి వెళ్తే రోడ్డు వేసే ఖర్చు, సమయం తగ్గుతాయని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రూ. 1.86 లక్షల కోట్లు అంచనా వ్యయంతో కూడిన ఈ మార్పునకు సంబంధించి జీఎం అనుమతి వచ్చిన తర్వాతే సర్వే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్-బెంగళూరు మార్గంలో సూచనలు

రూ. 1.44 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన హైదరాబాద్-బెంగళూరు కారిడార్ అలైన్‌మెంట్ విషయంలోనూ ప్రభుత్వం పలు సూచనలు చేసింది.

ప్రభుత్వం ప్రతిపాదన: శ్రీశైలం మీదుగా రోడ్డు వేయాలి. ఎందుకంటే, శ్రీశైలానికి ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్‌తో నేషనల్ హైవే వస్తుంది.

రైల్వే ఆలోచన: అయితే శ్రీశైలం గుండా ఈ రైలు మార్గం వేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అవుతుందని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల నిర్మాణం మూడు రాష్ట్రాలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక/తమిళనాడు) మీదుగా జరగనుంది. ఈ మార్పులు అమలులోకి వస్తే ఈ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.