Pushpa-2 effect : హైకోర్టు మరో సంచలన నిర్ణయం

‘పుష్ప-2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనను తెలంగాణ హైకోర్టు సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.


అలాగే 16 ఏళ్ళ లోపు పిల్లలను ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత సినిమాలకు అనుమతించ వద్దని తాజాగా హైకోర్టు అభిప్రాయపడింది. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్ళ లోపు పిల్లలను సినిమా థియేటర్లకు అనుమతించ వద్దని స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో, పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదిస్తూ..

సినిమాటోగ్రఫీ రూల్స్‌ ప్రకారం ఉదయం 8:40లోపు, అర్థరాత్రి 1:30 తర్వాత సినిమాలను ప్రదర్శించరాదని అన్నారు. ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని తెలిపారు. అర్ధరాత్రి షోలకు 16 ఏళ్ళ లోపు పిల్లలు వెళ్లడం వల్ల.. వారి శారీరిక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వాదనలు విన్న కోర్టు.. ప్రతివాదులైన హోం శాఖ కార్యదర్శి, తెలంగాణ ఫిల్మ్ టీవీ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది. తాజా హైకోర్టు నిర్ణయంతో ఫ్యామిలీ సెకండ్ షోలకు దూరమయ్యే అవకాశముంది. దాంతో కలెక్షన్లపై, ముఖ్యంగా ఓపెనింగ్స్ పై ప్రభావం పడనుంది. అయితే మనుషుల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదని, హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.