ఒకటో తరగతిలోనే వేయండి

మండలంలోని కోసమాళ గ్రామానికి చెందిన ఓ పిల్లాడికి నిండా ఐదేళ్లు నిండలేదు.


కానీ, ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఓ ప్రైవేట్‌ స్కూల్‌కు వెళ్లి తమ బాబుని ఒకటో తరగతిలో చేర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. అందుకు ఆ స్కూల్‌ యాజమాన్యం అంగీకరించలేదు. యూకేజీ, ఎల్‌కేజీ చదివిన తరువాతే ఒకటో తరగతికి పంపిస్తామని చెబుతున్నా ఆ బాలుడి తల్లిదండ్రులు వినడం లేదు. ఇక్కడ చేర్చుకోకపోతే వేరే స్కూల్‌లో తమ బాబుని చేర్పిస్తామని వారు అనడంతో సంబంధిత స్కూల్‌ యాజమాన్యానికి ఏమిచేయలో తెలియని పరిస్థితి నెలకొంది.

తల్లికి వందనం పథకం వస్తుందనే ఆశతో ఆ తల్లిదండ్రులు తమ పిల్లాడిని ఒకటో తరగతిలో చేర్పించాలని పట్టుబడుతున్నారని తెలియడంతో ఆ స్కూల్‌ యాజమాన్యం అవాక్కైంది. ఈ పరిస్థితి జిల్లాలో చాలాచోట్ల ఉంది. ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాల్లో రూ.13వేలు చొప్పున జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.

ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు వర్తించదు. దీంతో, తల్లికి వందనం పథకం పొందేందుకు కొందరు తల్లిదండ్రులు ఐదేళ్లు నిండని తమ పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలకు తీసుకెళ్లి వారిని ఒకటో తరగతిలో చేర్పించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థుల వివరాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లల వివరాలు ఆన్‌లైన్‌ పోర్టర్‌లో ఇదీ వరకే నమోదై ఉన్నాయి. ఇలాంటి వారిని ఒకేసారి ఒకటో తరగతిలో చేర్పిస్తే తెలిసిపోతుంది.

అందుకే దీనికి ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. పిల్లల వయసును బట్టి తరగతుల్లో చేర్పించాలనే అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు వయసు గల పిల్లలు సుమారు 40,766 మంది వరకు ఉన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.