మహానాడులో ఆ వంటకాలు పెట్టండి: మోదీ సలహా

ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు శనివారం రాత్రి భేటీ అయ్యారు. ఉదయం అంతా.. నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానితో పాటే పాల్గొన్న సీఎం చంద్రబాబు..


మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారని ప్రధానితో కితాబు అందుకున్నారు. అనంతరం.. మరోసారి ఐదు నిమిషాల పాటు.. ప్రధాని అప్పాయింట్ మెంటు తీసుకుని ఆయనను కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఆరాతీశారని తెలిసింది. మహానాడు నిర్వహిస్తున్నారటగా.. అని ఆయన ప్రశ్నించగా.. ఇది పార్టీ కార్యక్రమమని.. ప్రతిసారీ నిర్వహించుకుంటా మని చంద్రబాబు బదులిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతం ప్రకారం పనిచేస్తోందని.. దీనిని కొనసాగిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సమయంలో ఎంత మంది వస్తారు? ఎన్ని రోజులు చేస్తారన్న చర్చ జరిగింది.

ఈ క్రమంలో మోడీ స్పందిస్తూ..మహానాడుకు వచ్చే అతిథులకు తృణధాన్యాలతో చేసిన వంటకాలు రుచి చూపించాలని కోరారని తెలిసింది. తృణ ధాన్యాల సాగును, విక్రయాలను కూడా కేంద్రం ప్రోత్సహిస్తోందని.. ప్రస్తుత ప్రపంచానికి తృణధాన్యాలతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు. అంతేకాదు.. మహానాడులో మూడు రోజుల పాటు ఏదో ఒక ప్రత్యేక వంటకంగా తృణ ధాన్యాలతో చేసిన పదార్థాలను వడ్డించాలని కోరినట్టు సమాచారం.

ప్రధాని సూచనలను సీఎం చంద్రబాబు కూడా అంగీకరించారని తెలిసింది. తాజాగా తృణ ధాన్యాలతో కూడిన వంటకాలను తయారు చేసే నిపుణుల కోసం. టీడీపీ నాయకులు ఆరా తీస్తున్నారు. దీనిని బట్టి ప్రధాని సూచనను సీఎం చంద్రబాబు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నట్టు అర్ధమవుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.