ధనుష్ చిత్రాలకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. 3 మూవీ నుంచి ఇక్కడ ధనుష్‌కు మంచి క్రేజ్ ఏర్పడగా.. రఘువరన్ బీటెక్‌తో ధనుష్ తెలుగు హీరోగా మారిపోయాడు. అప్పటి నుంచి ధనుష్ సినిమాలను తెలుగు వారు ఆదరించడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు ధనుష్ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించిన రాయన్ చిత్రం థియేటర్లోకి వచ్చింది. జూలై 26న ఈ మూవీ విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి సమీక్షచూద్దాం.
కథ
రాయన్ (ధనుష్) తన ఇద్దరు తమ్ముళ్లు (సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్), చెల్లి దుర్గ (దుషార విజయన్) కోసమే బతుకుతుంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమై.. తమ్ముళ్లు, చెల్లిని ఎంతో కష్టపడి పెంచుతాడు రాయన్. శేఖర్ (సెల్వ రాఘవ) వీరికి ఆశ్రయం కల్పిస్తాడు. రాయన్ నివసించే ఏరియా దురై (శరవణన్) చేతి కింద ఉంటుంది. ఇక సేతు (ఎస్ జే సూర్య) ఆ ఏరియాపై పట్టు సాధించాలని అనుకుంటాడు. సిటీకి కొత్తగా వచ్చిన కమిషనర్ (ప్రకాష్ రాజ్) రౌడీ గ్యాంగ్‌లను ఏరిపారేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో రాయన్ పెద్ద తమ్ముడు ముత్తు (సందీప్ కిషన్)కు ఎదురైన పరిస్థితులు ఏంటి? తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాయన్ ఏం చేశాడు? చివరకు రాయన్‌కే తన తమ్ముళ్లు ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది? ఆఖరికి రాయన్ చెల్లి దుర్గ ఏం చేసింది? రాయన్ కథ చివరకు ఏం అవుతుంది? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
రాయన్ సినిమా కథ ఓవరాల్‌గా చూస్తే కొత్తదేమీ కాదు. ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న కథే ఇది. కానీ ధనుష్ ఇలాంటి పాత కథను కాస్త పాలిష్ చేసి తన స్టైల్లో తెరకెక్కించాడు. సినిమా అంతా ఒకే టోన్‌లో కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తుంటే.. రాయన్‌కు ఏదో పెద్దగా బాషాలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అనుకుంటాం. కానీ అదేమీ చూపించడు. రాయన్ అంటే అవతలి వాడు భయపడాల్సిందే అన్నట్టుగా చూపించేశాడు.
తమ్ముళ్లు, చెల్లి కోసం బతికే అన్న కథే ఈ రాయన్. ఇక ఇలాంటి కథలో కావాల్సినంత ఎమోషన్‌ను పెట్టుకోవచ్చు. తమ్ముళ్లు, చెల్లి సెంటిమెంట్‌ను వాడుకుని ఎన్నో కథలను ఇప్పటి వరకు తయారు చేశారు. ఈ రాయన్ కూడా అలాంటి పాయింట్లతోనే ఉంటుంది. కానీ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ సినిమా అంతా కూడా నెక్ట్స్ సీన్ ఏంటో చెప్పేసేలా ఊహకందేలానే సాగుతుంది. అదే ఈ చిత్రానికి కాస్త మైనస్ అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ అంతా కూడా సాదా సీదాగా సాగుంది. తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దంలా రాయన్ పాత్ర కూడా అలానే సాగుతుంది. ఇంటర్వెల్‌కు సినిమా పీక్స్‌కు వెళ్తుంది. ఆ తరువాత రాయన్ కొద్ది సేపు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. మళ్లీ హాస్పిటల్ సీన్‌తో అదిరిపోతుంది. అక్కడ దుషార హైలెట్ అవుతుంది. అయితే సెకండాఫ్‌లో మరింత ఎమోషనల్ సీన్స్‌కు స్కోప్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ధనుష్ ఆ యాంగిల్‌ను తీసుకోలేదు. అలా తీసుకుంటే మళ్లీ రొటీన్ అనే ఫీలింగ్ వస్తుందని అనుకున్నాడో ఏమో. కానీ రాయన్‌ను ఎలా చూసుకున్నా కూడా కొత్తగా అనిపించదు. కథ, స్క్రీన్ ప్లే ఇలా అన్నీ కూడా పాత పద్దతిలోనే సాగినట్టుగా అనిపిస్తుంది.
కానీ రాయన్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, పడిన ఎలివేషన్ షాట్స్ అదిరిపోతాయి. రాయన్ కాదు రావణ్ అనేలా తెరపై కనిపిస్తుంది. అయితే ధనుష్ తన పాత్రకు మాత్రమే స్పేస్, స్కోప్ ఇవ్వలేదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా అన్ని పాత్రల కోణాల్లోంచి ఆలోచించినట్టుగా కనిపిస్తుంది. సందీప్ కిషన్‌కు చాలా లెంగ్తీ అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు. కొన్ని చోట్ల దుషార కారెక్టర్ మెప్పిస్తుంది. అలా అన్ని యాంగిల్స్‌లో రాయన్ కథను బాగానే రాసుకున్నాడు. దర్శకుడిగా ధనుష్ మరోసారి సత్తా చాటుకున్నాడు. అయితే ఈ రాయన్ మన తెలుగు వాళ్లకి అంతగా ఎక్కుతుందా? అంటే చెప్పలేం. కాస్త స్లోగా, బోరింగ్‌గా, నిరాసక్తంగా సాగుతుంది. కానీ ఒక్కసారి రాయన్ కారెక్టర్‌కు కనెక్ట్ అయితే మాత్రం ఇవేవీ గుర్తుకు రావు.
టెక్నికల్ టీంని ధనుష్ అద్భుతంగా వాడుకున్నాడు. సినిమా మూడ్ చెప్పేలా కెమెరాను ముందే సెట్ చేసుకున్నాడనిపిస్తుంది. సినిమా అంతా ఓ బాధ, నివురు గప్పిన నిప్పుని చూపిస్తున్నట్టుగానే అనిపిస్తుంది. విజువల్స్ ఎంతో సహజంగా కనిపిస్తాయి. రెహ్మాన్ ఇచ్చిన పాటలు అంతగా గుర్తుండవు. కానీ రాయన్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్, ఆర్ఆర్ మాత్రం అదిరిపోతుంది. సెట్ వర్క్ నేచురల్‌గా ఉంది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.
ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి రా అండ్ రస్టిక్ కారెక్టర్లు అంటే మరింతగా రెచ్చిపోతాాడు. అసురన్‌లో ధనుష్ అగ్రెసివ్ నటనను చూసేశాం. రాయన్‌లోనూ ధనుష్ అలాంటి ఓ పాత్రనే పోషించాడు. ఇక ఇందులో ధనుష్ ఒకే రకంగా అనిపిస్తాడు. లుక్, ఎక్స్‌ప్రెషన్స్ సినిమా అంతా ఒకేలా అనిపిస్తుంది. సందీప్ కిషన్‌కు మంచి పాత్ర దొరికింది. అపర్ణా బాలమురళీకి సరిపడే పాత్ర అయితే లభించలేదనిపిస్తుంది. ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. ఎస్ జే సూర్య ఎప్పటిలానే అదరగొట్టేశాడు. ఈ సినిమాకు దుషార విజయన్ కారెక్టర్ హైలెట్ అనిపిస్తుంది. ఇలాంటి కారెక్టర్ దొరకడం కూడా కష్టమే. దొరికిన పాత్రని దుషార దుమ్ములేపేసింది. సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ స్థాయికి తగ్గ కారెక్టర్ దక్కలేదనిపిస్తుంది. ఏ కారెక్టర్‌కి మేకప్ వేయకుండా సహజంగా చూపించాడు ధనుష్.