రాగి జావ ఇలా చేసుకొని తాగితే..మన పూర్వీకుల ఎముకల బలం మీ సొంతం

www.mannamweb.com


మన పూర్వీకులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించడానికి ప్రధాన కారణం వారి ఆహార అలవాట్లు. ఆరోగ్యకరమైన తిండి తిన్నారు కాబట్టే ఎలాంటి షుగర్,బీపీ,గుండె జబ్బులు,క్యాన్సర్ వంటి రోగాలు లేకుండా హాయిగా జీవించారు.

మన పూర్వీకులు తమ ఆహారంలో భాగంగా ప్రతి రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్ రాగి జావ తాగేవాళ్లు. అందుకే వాళ్ల ఎముకలు బలంగా,దృఢంగా ఉండేవి. ఇప్పుడు చాలామంది మన పూర్వీకుల ఈ ఫుడ్ స్టైల్ ని షాలో అవుతున్నారు.

ఉదయాన్నే రాగిజావ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రాగిజావ ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన పోషకాహారాలను కలిగి ఉంటుంది. ఫైబర్‌,విటమిన్స్,మినరల్స్,కార్బోహైడ్రేట్‌లు,కొవ్వులు, ప్రొటీన్‌ల వంటి అన్ని అవసరమైన స్థూలపోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.

ఒకప్పుడు పెద్దగా ఎలాంటి ఖర్చు చేయకుండా ఈజీగా దొరికే రాగిజావను ఇప్పుడు సిటీల్లో ఓ గ్లాస్ నే 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. అయితే అంత ఖర్చు పెట్టకుండా రాగి జావను ఇంట్లోనే చాలా సులభం చేసుకొని మన పూర్వీకుల్లా ఆరోగ్యంగా ఉండవచ్చు. రాగి జావ ఎలా చేసుకోవాలి,దీని తయారీకి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం.

రాగి జావ తయారీకి కావాల్సినవి

నీరు-2 లేదా 3 గ్లాసులు

రాగి పిండి- 4 టేబుల్ స్పూన్స్

ఉప్పు-రుచికి తగినంత

జీలకర్ర పొడి – 1/2 టేబుల్‌ స్పూన్‌

మజ్జిగ లేదా పెరుగు-1 కప్పు

రాగి జావ తయారీ విధానం

-ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో రాగి పిండి వేయండి.

-ఇప్పుడు అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపండి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పొయ్యి మీద పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయండి.

-నీళ్లు మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని పొయ్యి మీద మరిగిన నీళ్లల్లో పోయాలి.

-ఇప్పుడు మంట చిన్నగా పెట్టి గరిటెతో జావ ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండండి.

-రెండు మూడు నిమిషాలు సన్నని మంటపై జావ ఉడికిన తర్వాత అందులో తగినంత ఉప్పు,జీలకర్ర పొడి వేసుకోవాలి.

-జావ కొద్దిగా చల్లారిన తర్వాత అందులోకి పెరుగు లేదా మజ్జిగ వేసుకుని కలిపి తాగితే చాలా బాగుంటుంది.

-జావ మరింత రుచికరంగా ఉండటానికి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు.