డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన రసాభాసగా మారింది.
బీజేపీ ఎంపీలు పోటీ ఆందోళన చేపట్టడంతో పార్లమెంట్ ముఖద్వారం వద్ద తోపులాట చోటుచేసుకుంది. ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి.
రాహుల్ గాంధీ వల్లే తనకు గాయాలయ్యాయంటూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓ ఎంపీని తోయడంతో ఆయన తనపై పడి ఇద్దరం పడిపోయామని చెప్పుకొచ్చారు. అయితే దీనిని కాంగ్రెస్ నేత రాహుల్ కాంధీ ఖండించారు. పార్లమెంట్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని రాహుల్ గాందీ అంటున్నారు. అంతేకాకుండా ముగ్గురు బీజేపీ ఎంపీలు తనను కొట్టేందుకు ప్రయత్నించారంటూ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు కూడా చేసింది. పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం నుంచి శాంతియుతంగా ప్రదర్శన చేస్తూ పార్లమెంట్ మకరద్వారంలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
అంతేకాకుండా తమ ఎంపీ రాహుల్ గాంధీని ముగ్గురు బీజేపీ ఎంపీలు కొట్టారని కూడా కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రతిపక్ష నేత గౌరవ మర్యాదలకు ఇది భంగం కల్గించడమేనని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. బీజేపీ ఎంపీల ఈ చర్య ప్రజాస్వామ్య స్పూర్థికి కూడా విరుద్ధమని స్పష్టం చేసింది. తక్షణం ఈ ఘటనపై బాధ్యులపై ఎంపీలపై చర్యలు తీసుకోవాలని కోరింది.