రైల్వే శాఖ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో 9,144 టెక్నీషియన్ పోస్టులకు ఈ ఏడాది గత మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ పోస్టును భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నాయి. జోన్ల వారీగా ఖాళీల వివరాలు కూడా వెల్లడించింది. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 959 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. మొత్తం పోస్టుల్లో అత్యధికంగా ముంబయి జోన్‌లో 1,883 పోస్టులు, అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 91 పోస్టులు ఉన్నాయి. కాగా ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా త్వరలో ప్రాధామ్యాల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారిక ఇనెలకు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు రూ.19,900 చొప్పున ప్రారంభ వేతనం అందిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహిస్తారు.
రాత పరీక్ష ఎలా ఉంటుందంటే..
టెక్నీషియన్ గ్రేడ్-I పోస్టులకు జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 10 ప్రశ్నలకు 10 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 15 ప్రశ్నలకు 15 మార్కులు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 20 మార్కులు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి. టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులకు మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ సైన్స్ విభాగం నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 10 ప్రశ్నలకు 10 మార్కులు అంశాలపై ప్రశ్నలు వస్తాయి. గంటన్నర వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.