నైరుతి రుతుపవనాలు వెళ్లినప్పటికీ ఈశాన్య రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వీటికితోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుంది.
దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి వరుసగా 3 రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురవనుంది. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు రావొద్దంటూ వాతావరణ అధికారులు సూచించారు. మరోవైపు … బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
































