తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే ఠక్కున ఆయన పేరు చెప్పేస్తారు. ఎందుకంటే ఆ స్థాయిలో చిత్రాలు నిర్మించింది ఆయనే.
బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ దాకా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాలు ప్రపంచస్థాయిలో సత్తాచాటాయి. నేటికి బాహుబలి చిత్రం విడుదలై దశాబ్దం రోజులు పూర్తి చేసుకుంది. తొలిభాగం 2015 జులై 10న విడుదలై భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజై తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది.
బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ పాత్రల పేర్లు ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. విజయేంద్రప్రసాద్ కథ అందించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ రూ. 180 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
అయితే ఈ రెండు భాగాలు కలిపి ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది? బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాలను ఓకే మూవీగా చూస్తే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. మీ అందరి కోసం మరోసారి బాహుబలి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో రెండు భాగాలను కలిపి ఓ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
రాజమౌళి తన ట్వీట్‌లో రాస్తూ..’బాహుబలి…అనేక ప్రయాణాలకు నాంది.. లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. అంతులేని ప్రేరణ.. అప్పుడే 10 సంవత్సరాలు పూర్తయింది. రెండు భాగాలను కలిపి సంయుక్త చిత్రంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ ప్రత్యేక మైలురాయిని గుర్తుచేసుకుంటున్నా. ఈ సినిమా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది’ అంటూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు రానా అభిమానులకు కూడా ఇక పండగే పండగ.
































