తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలూడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్‌కు శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘జగన్.. పోలీసులను బట్టలూడదీసి కొడతానంటున్నారా. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా? కష్టపడి చదివి, పరుగు పందెల్లో పాసై.. వేలాదిమంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం ఇది. మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేం నిజాయతీగానే ప్రజల పక్షాన నిలబడతాం. నిజాయతీగానే ఉద్యోగం చేస్తాం. నిజాయతీగానే చస్తాం తప్ప.. అడ్డదారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి’ అంటూ జగన్‌ను హెచ్చరించారు. గతనెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని.. అయినా ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు.
ఉద్యోగులకు భరోసా కల్పించండి: జగన్ శిష్యులు ‘మా దగ్గర తుపాకులు ఉన్నాయి.. రండి ఎవరొస్తారో’ అని రెచ్చగొడుతున్నారని.. ఇలా కిందిస్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, హోంమంత్రి, డీజీపీలను కోరారు.