ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. నేడు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు.
చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో ఈరోజు హుటాహుటిన చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ కు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు మరణ వార్త నారావారి కుటుంబాన్ని కలచివేసింది.
సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి
గత కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందిన చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇక తన చిన్నన్న అనారోగ్య కారణాలతో నేడు నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని హైదరాబాద్ లోని ఆసుపత్రికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్ కి తిరిగి వస్తున్నారు.
రామ్మూర్తి నాయుడు ప్రస్థానం
నారా రామ్మూర్తి నాయుడు 1952లో ఉన్నారా ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో నారా రోహిత్ కాగా, మరొకరు నారా గిరీష్. 1994 నుండి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు.
అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా చంద్రబాబు సోదరుడు
రామ్మూర్తి నాయుడు కొంతకాలం పాటు టీడీపీ లో కీలకంగా పనిచేసిన ఆయన ఆ తర్వాత తన అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టిడిపి శ్రేణులు కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
నారా వారి పల్లిలో అంత్యక్రియలు
ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన చంద్రబాబు అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా సోదరుడి మృతితో ఆయన తన ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి వస్తున్నారు. రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నారా వారి పల్లిలో జరగనున్నట్టు సమాచారం.