కొత్తగా వెలుగులోకి అరుదైన బ్రెయిన్ వ్యాధి..ఇప్పటికే ముగ్గురు మృతి

కేరళలో ఇటీవల అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే అరుదైన వ్యాధి (Kerala brain infection) వెలుగులోకి వచ్చింది. ఈ మెదడు ఇన్ఫెక్షన్ కారణంగా ఇప్పటివరకు మూడు మరణాలు సంభవించడం కలకలం రేపుతోంది.


ఇదే సమయంలో కేరళలో ఇప్పటివరకు 42 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధి ఎలా సోకింది, దీని లక్షణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అంటే ఏంటి?

అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనేది నేగ్లీరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వచ్చే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్. ఈ అమీబా సాధారణంగా కలుషితమైన నీరు, సరస్సులు, నదులు లేదా బాగా శుభ్రం చేయని కొలనులలో కనిపిస్తుంది. ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మెదడును ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. చాలా సందర్భాలలో ఇది ప్రాణాంతకంగా మారుతుంది.

కేరళలో ఇటీవలి పరిస్థితి

కేరళలో ఈ ఇన్ఫెక్షన్ వల్ల మూడు మరణాలు నమోదయ్యాయి. అందులో ఒకటి కోజికోడ్ జిల్లాలోని ఓమస్సేరి నుంచి అబుబకర్ సిద్దీక్ అనే వ్యక్తి మూడు నెలల శిశువు, రెండోది మలప్పురం జిల్లాలోని కప్పిల్లో 52 ఏళ్ల రమ్లా అనే మహిళకు వచ్చింది. ఈ ఇద్దరూ కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఇంతకు ముందు, ఆగస్టు 14న, తమరశ్శేరి నుంచి ఒక తొమ్మిదేళ్ల బాలిక కూడా ఈ ఇన్ఫెక్షన్‌తో మరణించింది. ప్రస్తుతం కోజికోడ్, మలప్పురం, వయనాడ్ జిల్లాల నుంచి ఎనిమిది మంది రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ వ్యాధి ఎలా వస్తుంది?

ఆరోగ్య అధికారుల ప్రకారం అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ సాధారణంగా కలుషితమైన నీటిలో ఈత కొట్టడం లేదా స్నానం చేయడం ద్వారా వస్తుంది. వెచ్చని నీటిలో ఈ అమీబా సులభంగా బతుకుతుంది. ముక్కు ద్వారా ఈ అమీబా శరీరంలోకి చేరితే, అది మెదడుకు చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. కేరళలో ఈ ఏడాది 42 కేసులు నమోదవడంతో ఈ వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు.

లక్షణాలు ఏంటి?

  • ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ లక్షణాలు సాధారణంగా ఒకటి నుంచి ఏడు రోజులలో కనిపిస్తాయి
  • తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు లేదా వికారం
  • మెడ బిగుసుకుపోవడం, మానసిక గందరగోళం, కంటి దృష్టిలో మార్పులు
  • ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి చాలా వేగంగా ముదిరిపోతుంది

జాగ్రత్తలు ఏంటి?

  • కేరళలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ కొన్ని నివారణ చర్యలు తీసుకుంటోంది. కోజికోడ్, వయనాడ్, మలప్పురం జిల్లాలలో బావులు, నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేస్తున్నారు.
  • కలుషిత నీటిని నివారించండి. సరస్సులు, నదులు లేదా శుభ్రం చేయని కొలనులలో ఈత కొట్టడం మానేయండి
  • ఈత కొడుతున్నప్పుడు ముక్కు క్లిప్‌లు ఉపయోగించండి లేదా ముక్కును గట్టిగా మూసుకోండి
  • స్నానం లేదా ముఖం కడుక్కోవడానికి శుభ్రమైన, క్లోరినేటెడ్ నీటిని మాత్రమే ఉపయోగించండి
  • ఈ వ్యాధి గురించి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయండి
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.