డిజిటల్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారులకు వ్యక్తులు చేసే పీ2ఎం చెల్లింపుల (P2M payments) పరిమితిని యూజర్ల అవసరాలకు అనుగుణంగా పెంచుకోవచ్చని తెలిపింది.
ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కు ఆర్‌బీఐ (RBI) అనుమతి కల్పించింది.
ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను కేంద్ర బ్యాంకు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ సందర్భంగా యూపీఐ చెల్లింపుల (UPI payments)పై తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. ”వినియోగాన్ని పెంచి యూపీఐ వ్యవస్థను మరింత సమర్థంగా మార్చేందుకు మేం ఈ ప్రతిపాదన చేస్తున్నాం. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో చర్చించి.. యూజర్ల అవసరాలకు అనుగుణంగా పీ2ఎం లావాదేవీల పరిమితిని NPCI పెంచుకోవచ్చు” అని ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు.
తగ్గనున్న ఈఎంఐ భారం.. హోమ్‌లోన్ ఉన్నవారికి ఆర్‌బీఐ ఊరట
అయితే, ఈ పెంపు వల్ల పొంచి ఉన్న ముప్పుల నుంచి తగిన రక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని మల్హోత్రా గుర్తు చేశారు. అంతేగాక, ఈ పరిమితులపై ఎన్‌పీసీఐ నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం వ్యక్తుల నుంచి వ్యక్తులకు చేసే పర్సన్ టు పర్సన్ (P2P), పర్సన్ టు మర్చెంట్ (P2M) యూపీఐ లావాదేవీలపై రూ.లక్ష వరకు పరిమితి ఉంది. అయితే, కొన్ని ప్రత్యేక అవసరాల కోసం పీ2ఎం చెల్లింపులపై రూ.2లక్షలు, రూ.5లక్షల వరకు పరిమితి ఉంది. పీ2ఎం లావాదేవీలపై ఈ పరిమితిని పెంచుకోవచ్చని తాజాగా ఆర్‌బీఐ చెప్పింది. అయితే, పీ2పీ చెల్లింపుల పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు.