యూపీఐ లావాదేవీల విషయంలో భారత్ దూసుకుపోతోంది. రోజురోజుకు యూపీఐ చెల్లింపు వ్యవస్థ మరింత మెరుగు పడుతోంది. ఈ యూపీఐ చెల్లింపుల విధానంలో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది.
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI)లను అందిస్తున్న కంపెనీల వాలెట్లలో ఉన్న మొత్తాన్ని ఇక నుంచి థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్లను వినియోగించి చెల్లింపులు చేసుకునే విధానం మార్పులు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్బీఐ ఓ సర్క్యులర్ జారీ చేసింది. కేవైసీ చేసుకున్న వినియోగదారులు ఈ థర్డ్ పార్టీ యాప్స్ నుంచి లావాదేవీలు చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
సాధారణంగా కొంత డబ్బును ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల్లో (PPIలు) ముందుగా డిపాజిట్ చేయవచ్చు. వాటిని వాలెట్లు లేదా ప్రీపెయిడ్ కార్డులు అని పిలుస్తారు. మీరు వాటి ద్వారా UPI, ఆన్‌లైన్ లావాదేవీలకు చెల్లింపులు చేయవచ్చు. మీ బ్యాంక్ ఖాతాతో సంబంధం లేకుండా PPI డబ్బును ఖర్చు చేసుకునే వెలుసుబాటు ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ చెల్లింపులను పీపీఐ ప్రొవైడర్ నుండి యూపీఐ ద్వారా చేయవచ్చు. ఇప్పటి నుండి ఈ పీపీఐలను ఏదైనా యూపీఐ యాప్‌కి లింక్ చేసుకుని లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.
వాలెట్, యూపీఐ యాప్ వేర్వేరు కంపెనీల యాజమాన్యంలో ఉన్నప్పటికీ, వినియోగదారులు తమ వాలెట్‌లను యూపీఐ యాప్‌కి కనెక్ట్ చేయవచ్చు. అంటే వాలెట్‌లోని మొత్తాన్ని వినియోగదారు ఇతర యూపీఐ అప్లికేషన్‌లలో కూడా ఉపయోగించవచ్చు. ఉదాహణకు.. మీరు మీ Phonepay లేదా Paytm వాలెట్‌లో ఒక మొత్తాన్ని డిపాజిట్ చేశారని అనుకుందాం. ఇంతకుముందు, కంపెనీలు UPIని ఉపయోగించినప్పుడు మాత్రమే ఈ మొత్తాన్ని చెల్లింపుల కోసం ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు మీరు మీ PhonePay వాలెట్‌లోని డబ్బుతో చెల్లించడానికి ఇతర UPI యాప్‌లను ఉపయోగించవచ్చు. ఇది డిజిటల్‌గా చెల్లించేటప్పుడు వినియోగదారులకు కొత్త సౌలభ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గిఫ్ట్ కార్డ్‌లు, మెట్రో రైల్ కార్డ్‌లు, డిజిటల్ వాలెట్‌లను ఉపయోగించే పీపీఐ వినియోగదారులు మరింత ఉపయోగకరంగా ఉంటుంది.