UPI లిమిట్‌ రూ.5 లక్షలకు పెంచిన ఆర్బీఐ.. అదనపు చార్జీలు ఉంటాయా

www.mannamweb.com


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా… కీలక నిర్ణయాలు తీసుకుంది. టాక్స్ పేమెంట్లపై యూపీఐ లిమిట్‌‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతకుముందు యూపీఐ టాక్స్ పేమెంట్స్ పరిమితి లక్షగా ఉండగా.. ఇప్పుడు దీనిని ఒకేసారి 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇకపై ట్యాక్స్ చెల్లించేవారు 5 లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా యూపీఐతోనే చేయవచ్చు. దీనికి ఎలాంటి అదనపు చార్జీలు పడవు. చెల్లింపులను డెబిట్ లేదంటే క్రెడిట్ కార్డులతో చేస్తే మాత్రం కొంత చార్జ్‌ పడుతుందని క్లారిటీ ఇచ్చింది ఆర్బీఐ.

ఇక డిజిటల్‌ యుగంలోనూ బ్యాంకింగ్‌ సేవల్లో ఏదైనా ఆలస్యం అవుతోందీ అంటే అది చెక్కుల క్లియరెన్సే. ఎవరైనా తమ పేరు మీద చెక్కు ఇస్తే దాన్ని నగదు రూపంలో మార్చుకోవడానికి ప్రస్తుతం రెండు మూడ్రోజుల సమయం పడుతోంది. ఇతర మార్గాల్లో వెంటనే నగదు లభిస్తున్న ఈ రోజుల్లో చెక్కులు మాత్రం రోజుల గడువు తీసుకుంటున్న వేళ… రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెక్‌ క్లియరెన్స్‌పై దృష్టిసారించింది. కొన్ని గంటల్లోనే చెక్కు క్లియరెన్స్‌ జరిగేలా సంబంధిత ప్రక్రియలో కీలక మార్పును ప్రకటించింది.

వేగవంతమైన చెక్కుల క్లియరెన్సు కోసం… చెక్‌ ట్రంకేషన్ సిస్టమ్‌లో మార్పులు చేయనున్నారు. బ్యాచ్‌ల వారీగా ప్రాసెసింగ్‌ కాకుండా.. ఇకపై ఆన్‌ రియలైజేషన్‌ సెటిల్‌మెంట్‌ విధానాన్ని అవలంభించనున్నారు. బ్యాంకు పని గంటల్లో చెక్కును స్కాన్‌ చేసి, ప్రజెంట్‌ చేసి, కొన్ని గంటల్లోనే పాస్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో కొన్ని గంటల్లోనే చెక్కు క్లియరెన్స్‌ పూర్తి కానుంది.