వాహనదారులకు షాక్.. 20 ఏళ్లకు పైబడిన వెహికల్స్ ఆర్‌సీ రెన్యువల్‌ ఫీజు రెట్టింపు..

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 20 ఏళ్ల పైబడిన వాహనాలను దేశవ్యాప్తంగా నడిపే వెసులుబాటు కల్పిస్తూనే.. ఆయా రిజిస్ట్రేషన్ రెన్యూవల్ రుసుములను గతంలో కంటే రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


దేశవ్యాప్తంగా 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలను నడపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇందుకోసం, వాహనదారులు అధిక రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ విషయమై కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఈ నియమం వర్తించదు, ఎందుకంటే ఇక్కడ 15 సంవత్సరాల వయస్సు గల వాహనాలను నడపడంపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది.

కొత్త నియమాల ప్రకారం, 20 ఏళ్లు దాటి పాత వాహనాలకు ఆర్‌సీ రెన్యూవల్‌ ఫీజులను కేంద్ర ప్రభుత్వం గతంతో పోల్చితే రెట్టింపు చేసింది. పాత వాహనాల వినియోగాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ రూల్ 81-4బీ కింద మాత్రమే ఆర్‌సీ రెన్యూవల్‌ కోసం అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా రూల్ 81 కింద 4సీ క్లాజ్ చేర్చింది. 20 ఏళ్లు దాటి ఉన్న వాహనాల ఆర్‌సీ రెన్యూవల్‌‌కు మార్గం సుగమం అయ్యేలా పద్ధతిని అందించారు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 20 ఏళ్లకు పైబడిన మోటార్ సైకిళ్ల ఆర్‌సీ రెన్యూవల్‌ ఫీజు రూ. 2,000 కి పెంచారు. అదే విధంగా త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ఈ రుసుము రూ. 5,000 కి పెరిగింది. దిగుమతి చేసుకున్న ద్విచక్ర, త్రిచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ రుసుము రూ. 20,000 కాగా, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాల వాహనాలకు రూ. 80,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలపై జీఎస్‌టీ కూడా అదనంగా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

వివిధ రకాల మోటారు వాహనాల ఆ‌ర్‌సీ రెన్యువల్ ఛార్జీల వివరాలు..

  • ఇన్ వ్యాలీడ్ క్యారేజ్ వాహనాలకు సాధారణ రెన్యువల్ రుసుము రూ.50 కాగా 20 ఏళ్లకు మించితే రూ.100
  • మోటార్ సైకిళ్లకు సాధారణ ఆ‌ర్‌సీ ఫీజు రూ.100, 20 ఏళ్లకు మించితే రూ.2000
  • 3/4 చక్రాల వాహనాలకు సాధారణ ఆ‌ర్‌సీ ఫీజు రూ.2500, 20 ఏళ్లకు మించితే రూ.5000
  • తేలికపాటి మోటార్ వాహనాలకు సాధారణ ఆ‌ర్‌సీ ఫీజు రూ.5000, 20 ఏళ్లకు మించితే రూ.10,000
  • 2/3 చక్రాల వాహనాలు దిగుమతి చేసుకుంటే సాధారణ ఆ‌ర్‌సీ ఫీజు రూ.10,000, 20 ఏళ్లకు మించితే రూ.20,000
  • 4 పైబడిన చక్రాల వాహనాలను దిగుమతి చేసుకుంటే సాధారణ ఆ‌ర్‌సీ ఫీజు రూ.40,000, 20 ఏళ్లకు మించితే రూ.80,000
  • పైవి కాకుండా మిగతావాటికి సాధారణ ఆ‌ర్‌సీ ఫీజు రూ.6000, 20 ఏళ్లకు మించితే రూ.12,000
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.