వృద్ధాప్యం ఎంతటి శాపం.. ‘బాబూ నువ్వొక వేషం ఇస్తే అవసరమైనవి కొనుక్కుంటాను’

‘‘కాస్ట్యూమ్‌ కృష్ణ గారి నిర్మాణంలో ‘కోడి రామకృష్ణ’ గారి (Kodi Ramakrishna) దర్శకత్వంలో జరగబోయే సినిమా కథా చర్చలు హైదరాబాద్ గ్రీన్‌పార్క్ హోటల్‌లో జరుగుతున్నప్పుడు, రోజూ డైరెక్టర్‌ గారిని కలవటానికి వచ్చేవారి తాకిడి వల్ల కథ ముందుకి సాగేది కాదు. దానివల్ల ఎవరు కాల్ చేసినా ‘డైరెక్టర్‌గారిక్కడ లేరు’ అని చెప్పాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే రూంలోని ల్యాండ్‌ ఫోన్ మోగితే లిఫ్ట్ చేశాను. అవతల నుంచి ‘కోడి రామకృష్ణ గారున్నారండీ.. నన్ను రాజనాల అంటారు’ అనగానే ‘ఆయన లేరండీ’ అని అబద్ధం చెప్పి పెట్టేశాను. కథ ఓ కొలిక్కొస్తే గానీ, నేను షెడ్యూల్ ప్లాన్‌ చేసి ఆర్టిస్ట్‌లకు డేట్స్ చెప్పలేను. కో-డైరెక్టర్‌గా అదీ నా టెన్షన్. మళ్లీ రెండోరోజు ఫోనొస్తే నేనే లిఫ్ట్‌ చేశాను. అవతల నుంచి మళ్లీ అదే వణుకుతున్న గొంతు. ‘నా పేరు రాజనాల. సీనియర్ ఆర్టిస్ట్‌ని. రామకృష్ణగారు నాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటినుంచీ తెలుసండి. ఓసారి ఆయన్ని కలిసి వెంటనే వెళ్లిపోతాను’ అనగానే ఒళ్లు ఝల్లుమంది నాకు’’


‘‘గుండమ్మ కథలో గుండమ్మని తన కంచు కంఠంతో అదిలించిన రౌడీ రాజనాల.. ఎన్టీఆర్‌, కాంతారావు గార్లతో కత్తి యుద్ధాలు చేసిన అరివీరభయంకర వ్యక్తి రాజనాల.. నా చిన్నతనంలో వెండితెర మీద నుంచే గుడ్లురిమి చూసి, వికటాట్టహాసాలతో నన్ను భయపెట్టిన రాజనాల.. అంతే.. ఎవరికీ వినపడకుండా ‘డైరెక్టర్‌గారు ఉన్నారు సర్. వచ్చేయండి’ అని పెట్టేశాను. గంట తర్వాత బెల్ మోగితే నేనే డోర్ తీశా. నమ్మ బుద్ధి కాలేదు. నా జ్ఞాపకాలలో ఉన్న రాజనాల కాదు అక్కడున్నది. చప్పి దవడలతో, ఒడలిపోయిన శరీరంతో, ఒకింత మెల్లకన్నుతో, కాళ్లకి తెల్లటి సాక్స్‌లతో ఉన్నారు. గురువు గారు (కోడిరామకృష్ణ) గౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ చెబితే, ‘వద్దు బాబూ.. షుగర్ ఎక్కువై కాలి వేలు తీసేశారు. నీ టైం వృథా చేయను. ఈ మధ్యే మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓ అభిమాని తన లాడ్జ్‌లో ఓ గది ఫ్రీగా ఇచ్చాడు. మొన్నీమధ్య రామానాయుడు గారు ఓ వేషం ఇస్తే ఆ డబ్బుతో ఓ ఫ్యాన్, కావల్సిన వస్తువులు కొన్ని కొనుక్కున్నాను. నువ్వో వేషం ఇస్తే మరికొన్ని అవసరమైనవి కొనుక్కుంటాను’ అంటూ వణుకుతున్న కంఠంతో ఇంకా ఏవో చెబుతున్నారు. ఒళ్లు జలదరించింది’’

‘‘మీరిక్కడ భోజనం చేసి వెళ్లే లోపు మీకు కావల్సిన వస్తువులు మీ రూంలో ఉంటాయి’ అని రామకృష్ణగారు అన్నారు. ‘అలా వద్దు బాబూ నాకు వేషం ఇవ్వు చాలు’ అన్నారు రాజనాల. వృద్ధాప్యం ఎంతటి శాపం. ఒకప్పుడు కండలు తిరిగిన గండరగండుడినైనా.. పళ్ళూడిన ముసలి సింహాన్ని చేసి మూలన కూర్చోబెడుతుంది. అప్పుడు కూడా తన రోజువారీ ఆహారం కోసం ఆ సింహమే వేటాడుకోవాల్సివస్తే ఎంతటి దైన్యం. మా ప్రొడక్షన్ కారులో పంపిద్దామని ఆయనతో పాటు కిందికి వెళ్లాను. ‘అక్కర్లేదు ఆటోలో వచ్చాను’ అని ఆటో ఎక్కారు. ఆటోకి నేను డబ్బివ్వబోతే ‘తీసుకోడు బాబూ. వాడికి నెలకోసారి ఇస్తాను. నన్ను బాగా చూసుకుంటాడు’ అని చెప్పి వెళ్లిపోయారు. తిరిగి రూంకి వెళ్ళేసరికి నటుడిగా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు రాజనాల గారు చేసిన తప్పొప్పుల పట్టికను వివరిస్తున్నారో సీనియర్ రచయిత. మహాశిఖరాన్నెక్కిన మనిషి అంచెలంచెలుగా కాక అమాంతం అగాధానికి పడిపోవడమెలా సాధ్యం? ఇప్పుడాలోచిస్తే సి.నా.రె.గారు రాసిన గీతం గుర్తుకొస్తుంది. ‘జీవితమే ఒక వైకుంఠపాళి – నిజం తెలుసుకో భాయీ.. ఎగరేసే నిచ్చెనలే కాదు – పడదోసే పాములు ఉంటాయి’ బయట ఉండే పాముల కన్నా మనలో ఉండే పాములతోనే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలేమో’’