కాలేయంలోని కణాలలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. లివర్‌లో కొంత కొవ్వు ఉండటం సాధారణం. కానీ అది 5-10% కంటే ఎక్కువ పేరుకుపోతే తీవ్రమైన ఆరోగ్య, కాలేయ సమస్యలకు దారితీస్తుంది.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ ఆల్కహాల్ తీసుకోని వారిలో కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఊబకాయం, సరైన ఆహారం తీసుకోకపోవడం, కూర్చొని ఎక్కువసేపు పని చేయడం, వ్యాయామం చేయకపోవడం, మధుమేహం వంటి సమస్యలు ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి. గుండెపోటు సమస్యలు కూడా లివర్‌పై నెగిటివ్‌గా ప్రభావం చూపిస్తాయి.
ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే రోగాలివే
కాలేయంలో కొవ్వు పెరిగి.. సమస్య ముదిరితే.. ఫైబ్రోసిస్, సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఫ్యాటీ లివర్‌ను మొదటి దశలో గుర్తిస్తే.. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మళ్లీ వెనక్కి తిరిగి తీసుకురావచ్చు.
ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చంటే..
జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ప్రారంభ దశలోనే కొవ్వులో కాలేయం ఉందని గుర్తిస్తే.. ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనిని రివర్స్ చేయడంకోసం పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ముందుగా ఆహార నియమాల్లో మార్పులు చేస్తే ఫ్యాటీ లివర్ ప్రభావం త్వరగా తగ్గుతుందిన చెప్తున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కెరను తీసుకోవడం నివారించాలి. కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు కలిగిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులను డైట్లో చేర్చుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫుడ్ ఈ సమస్యను తగ్గించడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది.
వైద్యులు సూచించే నియమాలు పాటిస్తూ.. జీవక్రియను మెరుగుపరచుకోవడానికి రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. వారానికి 150 నిమిషాల వ్యాయామ సమయం ఉండేలా చూసుకోవాలి. ఏరోబిక్స్ చేస్తూ బరువును తగ్గించుకోవడం ద్వారా.. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అలాగే ఫుడ్ కంట్రోల్ చేయాలని సూచిస్తే చాలామంది క్రష్ డైట్లు చేస్తారని.. వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే త్వరగా బరువు తగ్గడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతుందని చెప్తున్నారు. అన్నింటికంటే ముందు, ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే కాలేయ పనితీరును మెరుగుపరచడానికి తగినంత నీరు తాగాలి.
ఈ తరహా ఆరోగ్య నియమాలతో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి మంచిగా కోలుకోవచ్చు. జీవనశైలి, ఆహారంలో ఈ మార్పులు చేసుకోవడం వల్ల మూడు నెలల్లోనే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ నుంచి రికవరీ అయ్యే అవకాశముంది. కాలేయంలో కొవ్వు శాతం గ్రేడ్ 2 అయితే నియమాలు మరింత కఠినంగా ఉంటాయి. ఆ సమయంలో వైద్యులు కొన్ని మందులు సూచిస్తారు. సమస్య మరింత తీవ్రంగా ఉంటే, వైద్యుడి సలహా మేరకు కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి.
































