విశాఖలో సముద్రం రంగు మారుతోంది. నీలిరంగులో కనిపించే సముద్రం.. భీమిలి తీరంలో కొంత భాగం లేత ఎరుపు వర్ణంలో కనిపించింది. దీంతో ఆ నీటిని పరిశీలించే పనిలోపడ్డారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషణోగ్రఫీ శాస్త్రవేత్తలు.
భీమిలితోపాటు విశాఖ ఆర్కే బీచ్ లోను కొంత భాగం సముద్రంలో రంగు మారినట్లు కనిపిస్తోంది. గతంలోనూ ఆర్కే బీచ్ లో.. సముద్రం ఎర్రగా కనిపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. శాస్త్రవేత్తలు, అధికారులు రంగంలోకి దిగి పరిశోధన ప్రారంభించారు. దీంతో మట్టి వల్ల సముద్రపు కెరటాల తాకడికి ఆ మట్టి సముద్రంలో చేరి అంత భాగం ఎర్రగా మారినట్టు నిర్ధారించారు. సబ్ మెరైన్ మ్యూజియం ప్రాంతంలో.. ఎర్రమట్టి దెబ్బల ప్రాంతం నుంచి తీసుకొచ్చిన మట్టిని వేయడం వల్లే అప్పట్లో సముద్రం రంగు మారినట్టు గుర్తించారు.
సముద్రపు నీరు రంగు మారితే..
‘బయో లుమిని సెన్స్ జీవుల్లో ఒకటైన నోటిలూకా బ్లూమ్ పచ్చ, ఎరుపు రంగులో ఉంటాయి. వెస్ట్ కోస్ట్ లో అప్పుడప్పుడు వీటి ప్రభావంతో సముద్రం ఆకుపచ్చ రంగులో మారుతూ ఉంటుంది. ముంబై నుంచి పాకిస్తాన్ వరకు ఈ పరిస్థితి తరచూ కనిపిస్తూ ఉంటుంది. అయితే.. మాన్సూన్ సీజన్లో కొచ్చిన్ లో.. సముద్రం ఎర్రగా మారుతూ ఉంటుంది. బయో లుమిని సెన్స్ జీవుల్లో ఒకటైన నోటిలూకా బ్లూమ్ వల్లే అక్కడ ఆ పరిస్థితులు ఉంటాయి. అలా జరిగితే ఆ ప్రాంతంలో వేల సంఖ్యలో చేపలు చనిపోతూ నీటి పైకి తెలుతూ కనిపిస్తూ ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో పొల్యూషన్, తీరంలో ఉన్న మట్టి కెరటాలకు సముద్రంలో కలిసిన కారణంగా కూడా నీరు రంగు మారుతూ కనిపిస్తుంది.’ అని టీవీ9 తో అన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ డైరెక్టర్ వివిఎస్ఎస్ శర్మ.
సముద్రపు నీటిపై శాస్త్రవేత్తల అధ్యయనం..
తాజాగా భీమిలి బీచ్ లో కొంత భాగం సముద్రం లేత ఎరుపు రంగులో కనిపించింది. లుమిని సెన్స్ జీవుల్లో ఒకటైన నోటిలూకా బ్లూమ్ కారణమని శాస్త్రవేత్తలు ఒకింత ఆందోళన పడ్డారు. స్వయంగా రంగంలోకి దిగి భీములి లోని సముద్రపు నీటిని పరిశీలించారు. అక్కడ తీర ప్రాంతం పై పరిశోధన చేశారు. అయితే.. భీమిలి సమీపంలో సముద్రంలో కనిపించిన లేత ఎరుపు రంగు కారణం బయో లుమిని సెన్స్ జీవుల్లో ఒకటైన నోటిలూకా బ్లూమ్ అని అనుమానించినప్పటికీ.. అక్కడ పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపించాయి. స్వయంగా అక్కడికి వెళ్లిన సముద్ర అధ్యయన శాస్త్రవేత్తలు నీటిని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ‘లుమిని సెన్స్ జీవుల్లో ఒకటైన నోటిలూకా బ్లూమ్ తోనే ఆ పరిస్థితి ఉంటే క్రమంగా ఆ రంగు పెరుగుతూ వస్తుంది. కానీ అక్కడ అలా లేదు. అక్కడ మట్టి వల్లే.. సముద్రంలో కొంత భాగం మీరు లేత ఎరుపు వర్ణంలో మారి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రేపటి వరకు దీనిపై పరిశోధనలు చేసి పూర్తి నిర్ధారణకు వస్తాం ‘ అని అన్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ డైరెక్టర్ వివిఎస్ఎస్ శర్మ. మరో వైపు ఆర్కే బీచ్ లోను.. కొంత భాగం సముద్రం రంగుమారినట్టు కనిపిస్తోంది. ఎప్పుడూ బ్లూ కలర్ లో ఉండే సముద్రం ఇలా కనిపించడంతో ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సందర్శకులు.