అమరావతి: విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనే ఉపాధ్యాయుల ప్రధాన విధి. వాళ్లు బాగా చదువుతున్నారా? ఇచ్చిన పని చేస్తున్నారా? మార్కులు ఎలా వస్తున్నాయి? ఇలాంటి అంశాలను పరిశీలించడం వారి బాధ్యత. కానీ, గత వైకాపా ప్రభుత్వం అనేక బోధనేతర పనులను వారిపై మోపింది. విద్యాహక్కు చట్టం ప్రకారం బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించకూడదన్న నిబంధనను పట్టించుకోలేదు. ఉదయం నుంచి విద్యార్థుల ఆన్‌లైన్ హాజరు, మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల వివరాలు, మరుగుదొడ్ల ఫొటోలు, భోజనం చిత్రాలు, కోడిగుడ్లు, చిక్కీల నిల్వల నిర్వహణ, స్టూడెంట్ కిట్ లబ్ధిదారుల వివరాల నమోదు, ‘నాడు-నేడు’ పనులు.. ఇలా అనేక పనులను ఉపాధ్యాయులతో చేయించింది. వీటిని తొలగించి, ఉపాధ్యాయులు బోధనపై దృష్టిపెట్టేలా అవకాశం కల్పించాలని అప్పట్లో ఉపాధ్యాయులు, సంఘాలు కోరినా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వమైనా బోధనేతర పనులను తగ్గించి, తమను బోధనకే వినియోగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
యాప్‌లో హాజరు.. ఆపై ఫొటోలు
విద్యార్థుల హాజరును ఉదయం 10.30లోపు యాప్‌లో నమోదు చేయాలి. దీనికి 15-20 నిమిషాలు పడుతోంది. అది పూర్తికాగానే మధ్యాహ్నభోజనం తినే విద్యార్థుల సంఖ్య, కోడిగుడ్లు తీసుకునేవారి సంఖ్యను నమోదు చేయాలి. ఆ తర్వాత మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా.. లేవా అని తెలుసుకునేందుకు ఫొటోలు తీసే బాధ్యతను ఉపాధ్యాయులకు అప్పగించారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోతే ఏఐ గుర్తిస్తుంది. అప్పుడు వాటిని శుభ్రం చేయించి, ఫొటోలు తీయాలి. ఫొటోలు అప్‌లోడ్ చేసేందుకు 20 నిమిషాలు పడుతోంది. మధ్యాహ్న భోజనంలో ఆహార పదార్థాలను విడివిడిగాను, అన్నింటినీ కలిపి ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. తనిఖీచేసిన ఉపాధ్యాయుడి ఫొటోనూ పెట్టాలి. ఎంతమంది భోజనం, కోడిగుడ్డు తీసుకున్నారనే వివరాలనూ నమోదు చేయాలి.
ఆన్‌లైన్ పనులు ఎక్కువే..
పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పర్యవేక్షణ పనులను ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. మెటీరియల్ కొనుగోలు, బిల్లుల అప్‌లోడ్‌తో పాటు నిర్మాణ పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. వీటిని తొలగించాలని ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు.
పాఠశాలల్లో నిర్వహించే ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం, యూడైస్ ప్లస్‌లో విద్యార్థుల వివరాల నమోదు ఉపాధ్యాయులే చేస్తున్నారు.
విద్యాకానుక కిట్లు పంపిణీ చేసిన తర్వాత లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకునే పనినీ ఉపాధ్యాయులే చేస్తున్నారు.
బోధన కంటే వాటికే ప్రాధాన్యం
బోధనేతర పనులను గత ప్రభుత్వం మొదట్లో ప్రధానోపాధ్యాయులకు అప్పగించింది. ఇవన్నీ చేయడం భారమని వారు చెప్పడంతో రోజుకో ఉపాధ్యాయుడు చేసేలా మార్చారు. ఉన్నతాధికారులు సైతం తనిఖీల సమయంలోనూ వీటి పరిశీలనే ప్రధానంగా చేస్తున్నారు. బోధన, విద్యార్థుల సామర్థ్యాలను పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలోని 12 వేలకు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ పనులకే ఎక్కువ సమయం పోతోంది. పాఠాలు చెప్పడం తగ్గిపోతోంది.
ఉన్నత పాఠశాలలు గతంలో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4.45 వరకు ఉండేవి. గత ప్రభుత్వం ఈ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు మార్చింది. దూరప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు ఆ సమయానికి రాలేకపోతున్నారని, మళ్లీ 9.45కు మార్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.