ఉద్యోగులకు పే స్కేల్‌ తగ్గింపు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

www.mannamweb.com


ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగుల పే స్కేల్ తగ్గించడం, వారికి చెల్లించిన మొత్తాలను తిరిగి వసూలు చేయడం శిక్షనాత్మక చర్యలతో సమానమని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, ఇది తీవ్ర ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఆర్ మాధవన్‌ల ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి పే స్కేలును తగ్గిస్తూ అక్టోబరు 2009లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఈ మేరకు ధర్మాసనం రద్దుచేసింది.

రిటైర్డ్ ఉద్యోగి పే స్కేల్‌ను తగ్గించిన బిహార్ సర్కారు.. అప్పటిదాకా ఆయనకు అధికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని, పొరపాటున అధిక స్కేలు దక్కినట్లు ఉత్తర్వులు వెలువరించింది. దీంతో పదవీవిరమణ చేసిన ఆ ఉద్యోగి న్యాయపోరాటం మొదలుపెట్టారు. సంబంధిత ఉత్తర్వులను పట్నా హైకోర్టు‌లో సవాల్ చేయగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం ఆగస్టు 2012లో సమర్థించింది. హైకోర్టు తీర్పును అతడు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌ల ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

ఆ ఉత్తర్వులు జారీ అయ్యే నాటికే ఉద్యోగి రిటైరయ్యారని, అంతటి సుదీర్ఘ కాలావధి తర్వాత ఆయన నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయడం సరికాదని చెప్పింది. బిహార్ ప్రభుత్వంలో సప్లయ్ ఇన్‌స్పెక్టర్‌గా 1966లో చేరిన అతడికి.. 15 ఏళ్ల తర్వాత తొలి పదోన్నతి లభించింది. 1981 ఏప్రిల్‌లో మార్కెటింగ్ ఆఫీసర్‌గా ప్రమోట్ అయ్యారు. సర్వీసుల్లో చేరి 1991 మార్చి 10 నాటికి 25 ఏళ్లు పూర్తికావడంతో సీనియర్ గ్రేడ్ హోదా ఇచ్చి.. మార్కెటింగ్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లయ్ ఆఫీసర్ పోస్ట్‌లో నియమించారు. ఆయన పే స్కేల్‌ను 1999 ఫిబ్రవరిలో సవరించిన బిహార్ ప్రభుత్వం.. 1996 జనవరి నుంచి అమల్లోకి వచ్చినట్టు తెలిపింది.

ఏడీఎస్ఓ హోదాలో జనవరి 31, 2001న పదవీ విరమణ పొందిన ఆయనకు.. 2009లో పే స్కేల్‌ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. పే స్కేల్ విషయంలో పొరపాటు జరిగిందని, రూ. 63,765 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఆయన బిహార్ ప్రభుత్వ ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆయన నుంచి రికవరీకి ఆదేశించడం చట్టవిరుద్దమని పేర్కొంది. బిహార్ ప్రభుత్వ ఉత్తర్వులను పక్కనబెట్టింది. అలాగే, ఈ కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దుచేసింది.