రిలయన్స్‌కు 5 లక్షల ఎకరాలు

www.mannamweb.com


రాష్ట్రంలో రిలయన్స్‌ ఇండిస్టీకి ఐదు లక్షల ఎకరాలు కేటాయించేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపిబి) ఆమోదించింది.

దీనిలో రూ.65 వేలకోట్ల పెట్టుబడితో 11 వేల టన్నుల సామర్థ్యంతో 500 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. సోమవారం ఉదయం వెలగపూడి సచివాలయంలో ఎస్‌ఐపిబి సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. మొత్తం తొమ్మిది ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.1,82,166 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు, 2,63,411 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని సిఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు.

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బిపిసిఎల్‌) నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఆరు వేల ఎకరాల్లో రూ.96,862 కోట్లతో భారీ రిఫైనరీని ఏర్పాటు చేయనుంది. దీనివల్ల 2,400 మందికి ఉపాధి దొరుకుతుందని లెక్కలేశారు. తొమ్మిది మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్‌, లెర్నింగ్‌ సెంటర్‌, రిఫైనరీ, పెట్రో కెమికల్స్‌ యూనిట్లు, క్రూడ్‌ ఆయిల్‌ టెర్మినల్‌, గ్రీన్‌ హెచ్‌2, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు నిర్మిస్తారని అధికారులు వివరించారు. వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ.88,747 కోట్ల ఆదాయం రానుంది.

2029లోగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. విశాఖపట్నం మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టిసిఎస్‌) రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, దీనివల్ల రెండువేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లిలో అజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ 70.71 ఎకరాల్లో ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. దీనికోసం రూ.1,046 కోట్లు పెట్టుబడులు రానున్నాయి.

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 106 ఎకరాల్లో రూ.1,174 కోట్లతో బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఎండిఎఫ్‌ వర్టికల్‌ బోర్డ్‌ ప్లాంటు తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇవి కాకుండా నూతనంగా తీసుకొచ్చిన క్లీన్‌ ఎనర్జీ పాలసీ ద్వారా ఐదు సంస్థలు రూ.83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఎఎం గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు కాకినాడలో 592 ఎకరాల్లో రూ.12 వేలకోట్లు పెట్టుబడితో గ్రీడ్‌ హైడ్రోజన్‌ ఆధారిత అమ్మెనియా తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. అలాగే జాన్‌ కొకిరిల్‌ ప్రాజెక్టు రూ.2 వేలకోట్లతో 40 ఎకరాల్లో రెండు గిగావాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కర్నూలు జిల్లా హోసూరు, పెద్ద హుల్తిలో 1,800 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో టాటా పవర్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ 400 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా మైలవరం, కొండాపురం, నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ హైబ్రీడ్‌ త్రీ ప్రైవేటు లిమిటెడ్‌కు రూ.2 వేల కోట్లతో 119 మెగావాట్ల విండ్‌ పవర్‌, 130 మెగావాట్ల సోలార్‌ హైబ్రీడ్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్లాంటు ఏర్పాటుకు ఎస్‌ఐపిబిలో ఆమోదం తెలిపారు.