వైసీపీ ప్రభుత్వంలో తనను పోలీస్ కస్టడీ (RRR Custodial Torture)లో హత్య చేయాలని చూశారని అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గతంలో ఆరోపించారు.
ఆయన మాటలు నిజమేనని తాజాగా తేలింది. రఘురామకు కస్టడీలో వేధింపుల కేసులో అరెస్టైన సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్పాల్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో రఘురామను పోలీస్ కస్టడీలో విపరీతంగా కొట్టారని, ఆయనను లాకప్లో చంపడానికి కుట్ర జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
విజయ్ పాల్కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
వైసీపీ ప్రభుత్వ సమయంలో ఎంపీగా ఉన్న రఘురామను కస్టడీలో తీవ్రంగా వేధించిన కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్పాల్ ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరైన ఆయనను దాదాపు 9 గంటలపాటు విచారించిన అనంతరం పోలీసులు విజయ్ పాల్ ను అరెస్ట్ చేశారు. బుధవారం నాడు పోలీసులు గుంటూరు కోర్టులో విజయ్ పాల్ను హాజరుపరచారు. 18 పేజీల రిమాండ్ రిపోర్టులను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన కోర్టు నిందితుడు విజయ్ పాల్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు.
విజయ్ పాల్ను ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని, ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రఘురామను లాకప్ తో చిత్రహింసలు పెట్టిన కేసులో అసలు సూత్రధారులు ఎవరు, ఎందుకు ఇవి చేశారనే దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. అసలు నిజాలు రాబట్టేందుకు విజయ్ పాల్ను తమ కస్టడీకి తీసుకుని ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు.
సీఐడీ ఆఫీసు నుంచి నడవలేని స్థితిలో రఘురామ వచ్చారు
రఘురామను గతంలో పోలీస్ కస్టడీలో తీవ్రంగా వేధించారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. సీఐడీ ఆఫీసుకు వెళ్లిన అప్పటి ఎంపీ రఘురామ కృష్ణరాజు నడవలేని స్థితిలో వచ్చారని.. ఆయన కాళ్లను తాళ్లతో కట్టేసి తీవ్రంగా కొట్టారని తెలిపారు. కస్టడీలో రఘురామను చంపడానికి సైతం ప్రయత్నించారని రాజేంద్రప్రసాద్ చెప్పారు. తనపై జరిగిన దాడి, వేధింపులు, హత్యకు కుట్ర జరిగిన విషయాన్ని రఘురామ కృష్ణరాజు సైతం కోర్టులో చెప్పారు. రఘురామ కస్టడీలో వేధింపులు ఎదుర్కొన్న కేసులో నివేదిక ఇచ్చిన జీజీహెచ్ డాక్టర్లు సైతం నిందితులు అవుతారని పేర్కొన్నారు. గతంలో విచారణ చేపట్టిన అందర్నీ.. ఇప్పటి వరకు ఈ కేసులో 27 మందిని విచారించినట్లు తెలిపారు. తనను కస్టడీలో వేధించారని, తనను తీవ్రంగా కొట్టారని కాళ్లకు తాకిన దెబ్బల్ని సైతం రఘురామ ఆ సమయంలో వీడియో తీసి పోస్ట్ చేశారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. కేసు దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయని, ప్రస్తుతానికి ఈ కేసులో కీలకంగా ఉన్న సీఐడీ మాజీ అధికారికి విజయ్ పాల్ ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరతామని చెప్పారు.
కస్టడీలో లేపాయాలని చూశారని రఘురామ ఆరోపణలు
గతంలో జైలు నుంచి వచ్చాక రఘురామ చెప్పిందే నిజమైంది. ఎన్నికల్లో గెలిచిన అనంతరం సైతం రఘురామ మాట్లాడుతూ.. కస్టడీలో ఉన్న సమయంలో తనను మూడుసార్లు లేపేయాలని ప్రయత్నం చేశారని సంచలన ఆరోపనలు చేయడం తెలిసిందే. జగన్ ఆదేశాలలో సీఐడీ తనను హత్య చేయాలని కుట్ర చేసిందని, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డానని రఘురామ వీడియోలో మాట్లాడుతూ కొన్ని రోజుల కిందట సంచలనానికి తెరతీశారు.