నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు

వైకాపా పాలనలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భారీ విగ్రహాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు సోమవారం తొలగించారు.


వైకాపా పాలనలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భారీ విగ్రహాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు సోమవారం తొలగించారు. నాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన పెద్దల సమక్షంలోనే నేడు తొలగించడం గమనార్హం. సమాజానికి విద్యావంతులను అందించే విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నేతల విగ్రహాలు పెట్టడం సరికాదని అప్పట్లో ఎంత మొత్తుకున్నా ఉపకులపతి ఆచార్య రాజశేఖర్‌ పట్టించుకోలేదు. వర్సిటీ నిధులతో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి ప్రభుత్వ సలహాదారు, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆహ్వానించి, పాలకుల ప్రాపకానికి పాకులాడారు.

విగ్రహాన్ని తొలగించాలని కొన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్న విద్యార్థులు.. సోమవారం ఉదయం టీఎన్‌టీయూసీ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నాటి ప్రభుత్వ మెప్పు కోసం మూడు రాజధానులకు అనుకూలంగా విశ్వవిద్యాలయంలో సమావేశాలు, చర్చావేదికలు నిర్వహించడం, వైకాపా ప్లీనరీకి పార్కింగ్‌ స్థలం కేటాయించడం వంటి చర్యలకు పాల్పడిన వీసీపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఆందోళనకారులతో వీసీ రెండు దఫాలుగా చర్చించారు. రెండు రోజుల్లో విగ్రహాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. అందుకు వారు ససేమిరా అన్నారు. సాయంత్రం లోపు తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. మరోపక్క తన అవినీతిపై కూడా విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు వీసీకి సంకేతాలు అందాయి. విధిలేని పరిస్థితుల్లో మెట్టు దిగిన రాజశేఖర్‌.. అప్పటికప్పుడు పొక్లెయిన్‌ తెప్పించి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు.