దేశంలో తరతరాలుగా ఒక నమ్మకం బలంగా ఉంది. అద్దె ఇంటిలో జీవించడం వల్ల డబ్బు వృధా, సొంత ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది ఒక మంచి ఆలోచన అని..
మధ్యతరగతి ప్రజలు ఈ ఆలోచనతోనే ఇల్లు కొనేందుకు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చిస్తుంటారు. కానీ కొంతమంది ఆర్థిక నిపుణులు ఈ నమ్మకం ఒక ఆర్థిక ఉచ్చు అని హెచ్చరిస్తున్నారు.
లెక్కలు ఇలా..?
మీరు రూ.1 కోటి విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేయడానికి బ్యాంకు నుండి రూ. 80 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. 9శాతం వడ్డీ రేటుతో 20 ఏళ్ల కాలానికి.. మీరు ప్రతి నెలా దాదాపు రూ.72,000 ఈఎంఐ చెల్లించాలి. అంటే మొత్తం 20 ఏళ్ల తర్వాత మీరు బ్యాంకుకు చెల్లించే మొత్తం రూ. 1.73 కోట్లు. ఇందులో వడ్డీ రూపంలోనే దాదాపు రూ. 93 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. మీరు ఇంటి ధర కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం వడ్డీ రూపంలోనే చెల్లిస్తున్నారు. ఈ మొత్తంతో మీరు చాలా ఏళ్లు అద్దెకు హాయిగా జీవించి ఉండవచ్చు. అయినప్పటికీ ప్రజలు అద్దెను డబ్బు వృధాగా ఎందుకు భావిస్తారనేది ఒక పెద్ద ప్రశ్న.
భావోద్వేగం – రియాలిటీ
ఇల్లు కొనుగోలు నిర్ణయం చాలావరకు భావోద్వేగాల ఆధారంగా తీసుకుంటారు. సొంతిల్లు ఉండాలి, జనాలు ఏమనుకుంటారు అనే సామాజిక ఒత్తిడి వల్ల చాలామంది తొందరపడి హోమ్ లోన్స తీసుకుంటారు. ఈ నిర్ణయం ఆర్థిక లాభనష్టాలను బట్టి కాకుండా మనసులోని కోరికల ఆధారంగా తీసుకుంటారు. ఇది చాలా ఖరీదైన పొరపాటు అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఇల్లు కొనుగోలు కోసం తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని డౌన్ పేమెంట్ కోసం ఖర్చు చేస్తారు. ఆ తర్వాత వారి జీతంలో సగం కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకే పోతుంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఉపయోగపడే నిధులు లేకుండా పోతాయి. ఆర్థికంగా ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. ఉద్యోగ బదిలీ లాంటి అవకాశాలు వచ్చినా ఇంటి బంధం వల్ల వేరే నగరానికి వెళ్లడం కష్టమవుతుంది. అంతేకాకుండా ఇంటి మరమ్మతులు, ఆస్తి పన్ను వంటి అదనపు ఖర్చులు కూడా ఉంటాయి.
అద్దెకు ఉండటం బెస్ట్ ఆప్షన్
దేశంలోని నగరాల్లో అద్దెపై వచ్చే రాబడి 3.5శాతం నుండి 5శాతం మధ్య మాత్రమే ఉంటుంది. అంటే రూ. 1 కోటి విలువైన ఇంటికి నెలకు రూ. 25-30 వేల కంటే ఎక్కువ అద్దె రావడం అరుదు. ఒకవేళ మీరు ఆ ఇంటిని కొనకుండా ఆ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడుల్లో పెడితే, 20 సంవత్సరాలలో మీ డబ్బు అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్‌లో రాబడి సాధారణంగా 6-7శాతం మాత్రమే ఉంటుందని, అది కూడా మార్కెట్ బాగా ఉన్నప్పుడు మాత్రమే అని ఆయన అన్నారు.
తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు
ఇల్లు కొనడం తప్పు కాదు.. కానీ ఎప్పుడు, ఎలా, ఎందుకు కొనాలనేది ఆలోచించుకోవాలి.
అత్యవసర నిధి: ముందుగా బలమైన అత్యవసర నిధిని సృష్టించుకోండి.
ఈఎంఐ లిమిట్: మీ నెలవారీ ఈఎంఐ మీ జీతంలో 25-30శాతం మించకుండా చూసుకోండి.
పొదుపు: డౌన్ పేమెంట్ తర్వాత కూడా మీ దగ్గర కొంత పొదుపు ఉండేలా ప్లాన్ చేసుకోండి.
దీర్ఘకాలిక ప్రణాళిక: కనీసం 7-10 సంవత్సరాలు ఆ ఇంట్లో నివసించాలనుకుంటేనే ఆస్తిని కొనండి.
ఈ సూచనలను పాటిస్తే భావోద్వేగాల ఆధారంగా కాకుండా ఆర్థిక ప్రణాళికతో సరైన నిర్ణయం తీసుకోవచ్చు.






























