ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇవాళ విజయవాడ వచ్చారు. టాలీవుడ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాక తిరిగి రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న ఆమె..
తాజాగా ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో విడిపోయినా సఖ్యతగానే ఉండే రేణూ దేశాయ్ ఆయన పార్టీ జనసేనకు మాత్రం దూరంగానే ఉన్నారు. అయితే ఇవాళ అనుకోకుండా మరో రాజకీయ పార్టీ కార్యక్రమంలో ఆమె పాల్గొనడం చర్చనీయాంశమైంది.
గత ఎన్నికలకు ముందు ఏపీలో బోడే రామచంద్రయాదవ్ నేతృత్వంలో భారత చైతన్య యువజన పార్టీ బీసీవై ఆవిర్భవించింది. ఈ పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా ప్రభావం మాత్రం చూపలేకపోయింది. అయితే ఆ పార్టీ నేతల ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇవాళ విజయవాడకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంతో పాటు వచ్చిన ఆమె బీసీవై పార్టీ సావిత్రీబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
సావిత్రి బాయి పూలే జయంతి గురించి , మహిళా టీచర్స్ గురించి మాత్రమే మాట్లాడటానికి మాత్రమే నగరానికి వచ్చినట్లు రేణూ దేశాయ్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలకు నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని ఆమె అన్నారు. పిల్లల జీవితంలో తల్లి తర్వాత మహిళా టీచర్స్ చాలా ముఖ్యమన్నారు. అణచివేత చర్యలకు వ్యతిరేకంగా జ్యోతి బాయ్ పులే స్ఫూర్తితో కదలాలని టీచర్లకు, మహిళలకు రేణూ దేశాయ్ పిలుపునిచ్చారు. అయితే రాజకీయాల గురించి మాత్రం రేణూ స్పందించలేదు.
గతంలో సినిమాల నుంచి తప్పుకున్నాక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరాలని కూడా ఆమెకు పిలుపు వచ్చింది. అయినా ఆమె ఎప్పుడూ స్పందించలేదు. అలాగే రాజకీయాల గురించి బహిరంగంగా మాట్లాడిందీ లేదు. కేవలం పవన్ గురించి, తన పిల్లల గురించి మాత్రమే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అలాంటిది ఇవాళ ఉన్నట్లుండి ఇలా తన మాజీ భర్త పార్టీ కాకుండా మరో పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఊహాగానాలకు కారణమయ్యారు.