తెల్లజుట్టు ఎందుకు వస్తుందో తేల్చేసిన పరిశోధకులు..! తిరిగి నల్లబడే రహస్యం ఇదిగో

తెల్లజుట్టు.. ఒకప్పుడు చాలా మందికి దాదాపు 40 ఏండ్లు దాటిన తర్వాతే వచ్చేది. కానీ ఇప్పుడు ఐదారేండ్ల వయసు మొదలు కొని ఎప్పుడు ఏ ఏజ్ వారికైనా వస్తోంది.


14 నుంచి 30 ఏండ్లలోపు వారిలో ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. అంటే ఒకప్పటిలా ఇప్పుడిది వయసుపైబడిన లక్షణాలకు నిదర్శనం కాదని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇటీవలి పరిశోధన గుర్తించింది. అది రావడానికి గల రహస్యాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఒత్తిడి, జుట్టు రంగు (Grey hair) మార్పు మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

జుట్టు తెల్లబడటం (Hair whitening) వయస్సు లేదా జన్యుశాస్త్రంతో ముడిపడి ఉంటుంది. కానీ అది మాత్రమే కారణమని చెప్పలేం. ఎందుకంటే ఇటీవల దానితో సంబంధం లేకుండానే పిల్లల నుంచి పెద్దల వరకు తెల్ల జుట్టు రావడం సాధారణమై పోయిందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళనలతో కూడిన జీవనశైలి, వయసుతో సంబంధం లేకుండా, జుట్టు త్వరగా తెల్లబడటానికి కారణం అవుతోందని కనుగొన్నారు. ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్, నోర్‌పైన్‌ఫ్రైన్(Norepinephrine)వంటి హార్మోన్ల రిలీజ్‌ అవుతాయి. ఇవి సానుభూతి నాడీ వ్యవస్థ(Sympathetic nervous system)ను యాక్టివేట్ చేయడం ద్వారా జుట్టు రంగు(Hair color)ను నిర్ణయించే లేదా ఉత్పత్తి చేసే మెలనోసైట్ కణాలను క్షీణింపజేస్తాయి. ఈ ప్రక్రియే ఇటీవల వయసుతో సంబంధం లేకుండాజుట్టు తెల్లబడటాన్ని వేగవంతం చేస్తున్నది.

పెద్దల్లో అయితే ఒత్తిడి కారణంగా జుట్టు తెల్లబడవచ్చు. మరి పిల్లల్లో ఎందుకలా జరగుతోంది? అనే సందేహం ఎవరికైనా రావచ్చు. కానీ ఆధునిక పరిస్థితులు, జీవన విధానం పిల్లల్లో, వారి మెదడు సామర్థ్యానికి మించిన ఒత్తిడిని కలిగిస్తున్నదని పరిశోధకులు అంటున్నారు. దీంతో వీరిలోనూ తెల్లజుట్టు వస్తున్నది. దీనినే ‘ప్రీమెచ్యూర్ గ్రేయింగ్’ అని కూడా పిలుస్తారు. అకాడమిక్ స్ట్రెస్, సామాజిక ఒత్తిడి లేదా గాయం, భయాందోళన వంటి పరిస్థితులు పిల్లల్లో సానుభూతి నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేయడం ద్వారా నల్లజుట్టును క్షీణింపజేసి తెల్లగా మార్చగల నోర్‌పైనెఫ్రిన్ అనే హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఇది బాల్యంలోనే తెల్లజుట్టు రావడానికి కారణం అవుతుంది.

అదనంగా ఒత్తిడి జుట్టు తెల్లబడటానికే కాకుండా, గుండె ఆరోగ్యం, రోగ నిరోధక వ్యవస్థ, జీవక్రియ వ్యవస్థలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే యోగా, మెడిటేషన్, తగిన పౌష్టికాహారం, తగినంత నిద్ర వంటి ఒత్తిడిని తగ్గించే జీవనశైలి మార్పులు, ఒత్తిడి నిర్వహణ పద్ధతుల వంటివి ఈ ప్రక్రియను నెమ్మదింప జేస్తాయి. కొంత వరకు తెల్లబడిన జుట్టును తిరిగి సహజ రంగుకు పునరుద్ధరించే అవకాశం కూడా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.