Revanth vs Mallareddy : తొడలు కొట్టిన అహంకారం కాళ్ల బేరానికి వచ్చింది

Revanth vs Mallareddy : రాజకీయాలన్నాకా పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగొద్దు. అధికారం కోల్పోయినప్పుడు బాధపడొద్దు. తమిళనాడులో కరుణానిధి, జయలలిత రాజకీయాలు చేసినప్పుడు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునేవారు.
కోర్టుకు లాక్కునేవారు. జైలుకు ఈడ్చుకునేవారు. వారిద్దరి మరణం తర్వాత అక్కడ అలాంటి రాజకీయాలు దాదాపు కనుమరుగయ్యాయి. వారిద్దరూ బతికి ఉన్నంత కాలం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. ఇలాంటి రాజకీయాలు మంచివి కావని వారికి చెబితే.. వారు వినిపించుకునేవారు కాదు.. అందుకే రాజకీయాల్లో ఉండేవారు పరిణతి, విజ్ఞత ప్రదర్శించాలి అని చెప్పేది..

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు తరహాలోనే రాజకీయాలు చోటుచేసుకున్నాయి. ధర్నా చౌక్ ఎత్తేయడం.. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించడం.. సొంత మీడియాలో అడ్డగోలుగా కథనాలు అచ్చేయడం.. ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు.. ఇక అప్పటి పాలనలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. “పాలమ్మి, పూలమ్మి సంపాదించిన” అని పదేపదే చెప్పే ఆయన.. తనకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో మాత్రం చెప్పడు. చెప్పలేడు. అలాంటి ఆయన అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మల్లారెడ్డి భూ అక్రమాలు వెలికి తీయడమే రేవంత్ రెడ్డి చేసిన పాపం. దానిని దృష్టిలో పెట్టుకొని మల్కాజ్ గిరి ఎంపీ స్థానానికి రాజీనామాకు నువ్వు సిద్ధమా? నేను సిద్ధమే అంటూ తొడగొట్టాడు. బహిరంగంగా సవాల్ విసిరాడు. రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా అవమానించాడు. సీన్ కట్ చేస్తే తొడగొట్టిన మల్లారెడ్డి ప్రతిపక్ష స్థానంలోకి వెళ్ళాడు. చీత్కరింపులు ఎదుర్కొన్న రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు..

ఇక అదిగో అప్పటినుంచి మల్లారెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అప్పట్లో తనకు దోస్త్ అని చెప్పినప్పటికీ రేవంత్ ఒప్పుకోలేదు. పల్లెత్తు మాట కూడా అనలేదు.. అప్పట్లో తాను మోపిన అభియోగాల సంగతి చూడండి అంటూ అధికారులను పురమాయించాడు. ఇంకేముంది వారు యాక్షన్ మొదలుపెట్టారు.. సవాల్ చేసిన మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు పంపించారు. ఇటీవల ఒక రోడ్డును నేలకూల్చారు. ఆయన అల్లుడు భవనాన్ని పడగొట్టారు. రికార్డుల ప్రకారం అది చెరువు పరిధిలోదట. అంటే ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి చెల్లుబాటయింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా.

Related News

రేవంత్ దాడులతో మల్లారెడ్డి భయపడ్డాడు. వెంటనే రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో రాయబారాలు మొదలుపెట్టాడు. రేవంత్ ను జర కల్పిండయ్యా అంటూ చేతులెత్తి మొక్కాడు.. నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడాలి అంటూ వేడుకున్నాడు. అవసరమైతే నేను, నా అల్లుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని రాయబారం పంపాడట.. మరి దానికి రేవంత్ ఎస్ అంటాడా? నో అంటాడా? రేవంత్ తలుచుకుంటే మల్లారెడ్డిని ఒక్క తొక్కుడు తొక్క గలడు. పాలు, పూలు అమ్మేలా చేయగలడు.. కానీ ఆ దిశగా అడుగులు పడతాయా? అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగల మల్లారెడ్డి రేవంత్ తో సంధి కుదుర్చుకోగలడా? ఏమో వీటికి కాలమే సమాధానం చెప్పాలి..

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *