మలయాళంలో విజయవంతమైన ‘కీడమ్’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ‘కీచురాళ్ళుగా’ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే?
చిత్రం: కీచురాళ్ళు; నటీనటులు: రజీషా విజయన్, శ్రీనివాసన్, విజయ్ బాబు, మణికందన్ తదితరులు; సంగీతం: సిద్ధార్థ ప్రదీప్; ఛాయాగ్రహణం: రాకేశ్ ధరణ్; ఎడిటింగ్: క్రిస్టీ సెబాస్టియన్; నిర్మాణ సంస్థలు: ఫస్ట్ ప్రింట్ స్టూడియోస్, ఫెయిరీ ఫ్రేమ్స్ ప్రొడక్షన్స్; దర్శకత్వం: రాహుల్ రిజీ నాయర్; ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఈటీవీ విన్.
థియేటర్లలో సందడి చేసిన పలు చిత్రాలు, ఒరిజినల్ మూవీస్, వెబ్‌సిరీస్‌లతోపాటు ఇతర భాషల్లో విజయాన్ని అందుకున్న ప్రాజెక్టులను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ముందుండే ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్’(ETV Win). అలా ఇటీవల రిలీజైన వాటిలో ‘కీచురాళ్ళు’ (Keechurallu) ఒకటి. మలయాళంలో విజయవంతమైన ‘కీడం’ (Keedam)కు డబ్బింగ్ ఇది. రజీషా విజయన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రిజీ నాయర్ తెరకెక్కించారు. మరి, ఈ సినిమా కథేంటి? ఎలా ఉందంటే? (Keechurallu Review)..
కథేంటంటే?: రాధిక (రజీషా విజయన్) సైబర్ సెక్యూరిటీ నిపుణురాలు. సొంతగా స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తూ ఉంటుంది. ఈమె ప్రతిభను గుర్తించిన పోలీసులు సైతం నేరస్థులను పట్టుకునేందుకు అప్పుడప్పుడు సహాయం కోరుతుంటారు. అలాంటి అమ్మాయినే ఓ యువకుడు తన గ్యాంగ్‌తో కలిసి కాల్స్, అసభ్య సందేశాలతో వేధిస్తుంటాడు. రాధికకు పరిచయస్థులైన పోలీసులు, న్యాయవాది అయిన తండ్రి కూడా విషయాన్ని పెద్దది చేయకపోవడం మంచిదని ఆమెకు సలహా ఇస్తారు. అయినా వారి మాట కాదని రాధిక ముందడుగేస్తుంది. మరి, స్క్రాప్ బిజినెస్ ముసుగులో ఆ రౌడీ గ్యాంగ్ చేస్తున్న అక్రమ కార్యకలాపాలేంటి? వారి నుంచి రాధికకు ఎదురైన సవాళ్లేంటి? ఎలా బుద్ధి చెప్పింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Keedam Review in Telugu).
ఎలా ఉందంటే?: కొందరు ఆకతాయిలు అమ్మాయిలకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించడం, ఒకవేళ తమకు ఎదురు తిరిగితే బ్లాక్ మెయిల్ చేసి బెదిరించడం లేదా బయట ఎక్కడ కనిపించినా వార్నింగ్ ఇవ్వడం.. ప్రతి రోజూ ఏదో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేటి సమాజంలో నెలకొన్న ఈ సమస్యనే దర్శకుడు రాహుల్ రిజీ నాయర్ తనదైన శైలిలో తెరపైకి తీసుకొచ్చారు. అయితే, సైబర్ సెక్యూరిటీ నిపుణురాలే బాధితురాలిగా కాకుండా సాధారణ అమ్మాయి పాత్ర కోణంలో ఈ కథను చూపించే ఉంటే మరింత ఎఫెక్టివ్‌గా ఉండేది. సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు అసలు కథలోకి వెళ్లేందుకు కాస్త సమయం తీసుకున్నారు. హీరోయిన్ వ్యక్తిత్వం ఎలాంటిది? టెక్నాలజీ సాయంతో మనుషులను ఎలా చదువుతుంది? అన్న విషయాలు తెలియజేసేలా రాసుకున్న సన్నివేశాలు బాగున్నా నెమ్మదిగా సాగడం సహనానికి పరీక్షే. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. ఈసారి ఏ అఘాయిత్యానికి పాల్పడతారోనని ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతుంటారు. న్యాయవాది అయినా సరే ఆ భయం తప్పదని హీరోయిన్ తండ్రి పాత్ర ద్వారా చూపించిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇలా తండ్రి సపోర్ట్ లేకపోయినా రంగంలోకి దిగిన రాధిక చేసే పోరాటం స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తుంది.
రాధికను టార్గెట్ చేసిన విలన్ గ్యాంగ్‌కు హెడ్ ఎవరు? వీరి నెట్‌వర్క్ ఏంటి? వంటి వాటినీ లోతుగా చూపించి ఉంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉండేది. ఆయా క్యారెక్టర్లలను సింపుల్‌గా తేల్చేయడంతో హీరోయిన్ చేసే టెక్నాలజీ మ్యాజిక్ అలరించినా ఏదో వెలితి ఉన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఫస్టాఫ్‌లో.. టెక్నాలజీతో టార్చర్ చేసిన వారిని అదే టెక్నాలజీతో బుద్ధి చెప్పిన రాధిక ప్లానింగ్‌ను సెకండాఫ్‌లో రివీల్ చేసిన తీరు బాగుంది. ఉత్కంఠభరితంగా ప్రీ క్లైమాక్స్‌ను క్రియేట్ చేశారు. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే ఉంటాయి.
ఎవరెలా చేశారంటే?: తక్కువ పాత్రలతో రూపొందిన సినిమా ఇది. రజీషా విజయన్‌కే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ. సమస్య వస్తే దిగులుపడకుండా తెగువ చూపే అమ్మాయి రాధిక పాత్రలో ఆమె ఒదిగిపోయారు. రజీషా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘రామారావు ఆన్ డ్యూటీ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దర్శకుడు రాహుల్ హీరోయిన్ కొలీగ్ రోల్‌లో సందడి చేశారు. రాధిక తండ్రిగా కనిపించిన శ్రీనివాసన్, పోలీసు పాత్రలు పోషించిన వారు, రౌడీ గ్యాంగ్ పరిధి మేరకు నటించారు. సాంకేతిక బృందం విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఓకే. 1:45 గం.ల నిడివితో సినిమాని క్రిస్పీగా ఎడిట్ చేశారు. వాస్తవికతకు దగ్గరగా ఉన్న కథలను తెరకెక్కించడం తన ప్రత్యేకత అని రాహుల్ మరోసారి చాటుకున్నారు.
కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమే ఇది. ఒక్క చోట మినహా అసభ్యకరమైన సంభాషణలు లేవు. సన్నివేశాలూ లేవు.
బలాలు:
+ కథ
+ రజీషా విజయన్ నటన
బలహీనతలు:
– ప్రథమార్ధంలో కొంత సాగదీత
– పేలవమైన పలు విలన్ పాత్రలు
చివరిగా: రాధిక పోరాటం.. ఆసక్తికరం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!