రివైండ్‌ 2024: విషాదాలు… విజయాలు

www.mannamweb.com


భారతావనికి ఈ ఏడాది మిగిల్చి వెళ్తున్న జ్ఞాపకాలెన్నో

2024లో భారతావని తీపి, చేదులెన్నింటినో చవిచూసింది. హిందువుల ఐదు శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలో బాలరామునికి దివ్య ధామం కొలువుదీరింది.

అస్తవ్యస్థ అభివృద్ధి తగదని కేరళ కొండల్లో ప్రకోపం రూపంలో ప్రకృతి హెచ్చరించింది. ‘400 పార్‌’ అన్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు హ్యాట్రిక్‌ ఇచ్చినా మెజారిటీకి కాస్త దూరంలోనే నిలబెట్టి షాకిచ్చారు. కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో శిక్షణ వైద్యురాలిపై కామాంధుడి హత్యాచారం యావత్‌ జాతినీ నిశ్చేష్టపరిచింది.

వలస చట్టాల స్థానంలో భారతీయ చట్టాలు వచ్చాయి. చచ్చిన జంతువుల చర్మాలపై వేళ్లు కదలించే వాళ్లంటూ దూరం పెట్టిన నోళ్లు నివ్వెరబోయేలా తబలాకు విశ్వవ్యాప్త కీర్తి కిరీటం తొడిగిన స్వర తపస్వి జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయంతో సంగీత ప్రపంచం మూగబోయింది. సంస్కరణల బాటలో దేశాన్ని ప్రగతి పరుగులు పెట్టించిన కర్మయోగి మన్మోహన్, పారిశ్రామిక జగజ్జేత రతన్‌ టాటా సహా దిగ్గజాలెందరో ఇక సెలవంటూ మనను వీడి వెళ్లారు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌లో జగజ్జేతగా నిలిచి టీనేజర్‌ గుకేశ్‌ దొమ్మరాజు ఆనంద డోలికల్లో ముంచెత్తాడు…

అయోధ్యలో బాల రాముడు
శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలో భవ్య రామమందిరం రూపుదిద్దుకుంది. బాల రాము ని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరిలో అతిరథ మహారథుల సమక్షంలో కన్నులపండువగా జరిగింది. వజ్రతిలకంతో అపూర్వ ఆభరణాలతో కూడిన ఆ సుందర రూపాన్ని చూసేందుకు భక్త కోటి పోటెత్తింది. ప్రారం¿ోత్సవాన్ని వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా వీక్షించారు.

సత్తా చాటిన ఇస్రో
2024 మొదలవుతూనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జయభేరి మోగించింది. కృష్ణబిలాలు, ఎక్స్‌ కిరణాలపై శోధనకు ఎక్స్‌రే పొలారీమీటర్‌ శాటిలైట్‌ను జనవరి 1న తొలి ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించింది. వారంలోపే సూర్యునిపై పరిశోధనలకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్‌-1ను సైతం ఎల్‌-1 కక్ష్యలోకి చేర్చింది. ఏడాది పొడవునా ప్రయోగాలతో సత్తా చాటింది.

పరిణిత తీర్పు
లోక్‌సభలో తమకు ఎదురు లేదని భావించిన కమల దళానికి ఓటర్లు చిన్న షాకిచ్చారు. మోదీ మేనియాలో హ్యాట్రిక్‌ ఖాయమన్న అంచనాలను నిజం చేసినా, బీజేపీని మాత్రం మెజారిటీకి కాస్త దూరంలోనే ఉంచారు. అయోధ్యకు నెలవైన లోక్‌సభ స్థానంలోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. విపక్ష ‘ఇండియా’ కూటమి పర్వాలేదనిపించింది. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కలిసొచ్చి కాంగ్రెస్‌ కూడా కాస్త కోలుకుంది.

దివికేగిన దిగ్గజాలు
న్యాయ కోవిదుడు ఫాలీ ఎస్‌ నారిమన్, వామపక్ష దిగ్గజాలు బుద్ధదేవ్‌ భట్టాచార్య, సీతారాం ఏచూరి మొదలుకుని ఓం ప్రకాశ్‌ చౌతాలా, ఎస్‌ఎస్‌ కృష్ణ వంటి దిగ్గజ నేతలను, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నిపుణురాలు యామినీ కృష్ణమూర్తి తదితరులనూ ఈ ఏడాదిలోనే దేశం కోల్పోయింది. పారిశ్రామిక దిగ్గజం, మానవీయ విలువలకు నిలువుటద్దం రతన్‌ టాటా అస్తమయం తీరని లోటు మిగిల్చింది. డిసెంబర్‌ అయితే పీడకలగా మిగిలింది. తబలా దిగ్గజం జాకిర్‌ హుస్సేన్, భారతీయ సినిమాకు మట్టి పరిమళాలద్దిన హైదరాబాదీ శిఖరం శ్యామ్‌ బెనగల్, రాజనీతిజు్ఞడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సంస్కరణల ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఒకరి వెంట ఒకరు సెలవంటూ వెళ్లిపోయారు.

బాండ్లకు బైబై
పారీ్టలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచి్చన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వాటి జారీని తక్షణమే నిలిపేయాలంటూ ఏకగీవ్ర తీర్పునిచ్చింది. ఎన్నికల బాండ్ల ముసుగులో గోప్యంగా విరాళాల స్వీకరణ సమాచార హక్కుకు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. దాతల పేర్లపై గోప్యత తగదని చెప్పింది.

వయనాడ్‌ విలయం
కేరళలోని వయనాడ్‌ జిల్లాలో మారుమూల గ్రామాలపై కొండచరియలు విరిగిపడ్డ విలయంలో 231 మంది అమాయకులు సజీవ సమాధి అయ్యారు. పర్యాటకం పేరిట కొండలను ఇష్టంగా తవ్వేసిన పాపానికి వాళ్లు బలైపోయారు. దాదాపు 120 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. వేలమంది సర్వస్వం కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌ జిల్లాలో సత్సంగ్‌లో బోలే బాబా పాదస్పర్శ జరిగిన మట్టి కోసం భక్తులు వేలాదిగా ఎగబడ్డ ఉదంతం తొక్కిసలాటకు దారితీసి 121 మంది ప్రాణాలు కోల్పోయారు.

అరెస్టులే అరెస్టులు
ఢిల్లీలో మద్యం విధా నం కుంభకోణం కేసులో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. ఎట్టకేలకు బెయిల్‌ మీద బయటికొచి్చనా నమ్మినబంటు అతిశిని ఢిల్లీ సీఎం కుర్చీపై కూర్చోబెట్టారు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన అత్యాచారాల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్‌ ఎంపీ ప్రజ్వల్‌ అరెస్టయ్యారు. కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప కూడా అభిమానిని కొట్టి చంపిన కేసులో కటకటాలపాలయ్యారు. సంచలనం సృష్టించిన నీట్‌ ప్రవేశ పరీక్షలోనూ పలు అరెస్టులు జరిగాయి.

రైతన్నల పోరుబాట
మద్దతు ధరకు చట్ట బద్ధత కోరుతూ పంజాబ్, హరియాణాలో కర్షకలోకం మరోసారి సమరశంఖం పూరించింది. శంభూ సరిహద్దు వద్ద మొదలైన రైతు ఉద్యమం మరోసారి ఉధృతంగా సాగింది. ఢిల్లీ, హరియాణా సరిహద్దుల దిగ్బంధం, పోలీసులతో రైతుల ఘర్షణ, లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో రైతన్నలు నెల రోజులుగా రోడ్డుపై రక్తమోడుతున్నా కేంద్రం నుంచి ఇప్పటికైతే సానుకూల ప్రకటన లేదు. నానాటికీ క్షీణిస్తున్న రైతు నేత డల్లేవాల్‌ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది.

అమల్లోకి సీఏఏ
వివాదాస్పద పౌరస త్వ సవరణ చట్టాన్ని మోదీ సర్కారు అమల్లోకి తెచ్చింది. 2014 డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలు లేకున్నా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైంది.

భారత న్యాయవ్యవస్థ
భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. బ్రిటిష్‌ హయాం నాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధార చట్టాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. సత్వర న్యాయం, జీరో ఎఫ్‌ఐఆర్, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు, ఎస్‌ఎంఎస్‌ వంటి ఎల్రక్టానిక్‌ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చాయి.

చైనా దోస్తీ
సరిహద్దు సంక్షోభాగ్నిని ఎగదోసే డ్రాగన్‌ దేశంతో ఎట్టకేలకు తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ ఒప్పందం కుదిరింది. అక్కడ బలగాల ఉపసంహరణ, ఉమ్మడి గస్తీకి ఇరు దేశాలు సరేనన్నాయి. దాంతో గల్వాన్‌ లోయ ఉద్రిక్తత అనంతరం దిగజారిన ద్వైపాక్షిక సంబంధాలు కాస్త మెరుగయ్యాయి.

ఆర్‌జీ కర్‌ దారుణం
కోల్‌కతా ఆర్‌జీ కర్‌ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై సివిల్‌ వలంటీర్‌ చేసిన దారుణ హత్యాచారం యావద్దేశాన్నీ కలచివేసింది. నిందితునితో అంటకాగిన కాలేజీ ప్రిన్సిపల్‌ను తొలగించకపోగా వేరే పోస్టింగ్‌ ఇచ్చి మమత సర్కారు జనాగ్రహానికి గురైంది. మహిళా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత గాల్లో దీపమంటూ దేశవ్యాప్తంగా వైద్య లోకం రోడ్డెక్కడంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు చర్యలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.

చదరంగంలో యువరాజు
18 ఏళ్ల గుకేశ్‌ దొమ్మరాజు చదరంగంలో భారత పతాకను సమున్నతంగా ఎగరేశాడు. ఏడేళ్ల వయసు నుంచే గళ్లపై తిరుగులేని పట్టు సాధించిన ఈ సంచలనం తాజాగా ప్రపంచ వేదికపై డిఫండింగ్‌ ఛాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను మట్టికరిపించి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచాడు.