కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. నెల రోజులు దాటినా వెంటాడుతున్న ఒక పీడకల. ఈ నెలరోజుల్లో అనేక మలుపులు తిరిగిన ఈ కేసు.. మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణలతో కొత్త మలుపు తిరిగింది.
డాక్టర్ల సమ్మె కారణంగా 23 మంది రోగులు చనిపోయారంటూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇవ్వడం దుమారం రేపుతోంది. కేసు విచారణ ఇలా నానా వంకర్లు తిరుగుతుంటే.. కోల్‌కతా అభయ ఉదంతంపై ప్రపంచ సమాజం మళ్లీ గళమెత్తింది. న్యాయం కావాలి అంటూ నినదించింది.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ హత్య కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్యూటీలో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికి కోల్‌కతా హత్యాచార ఘటనపై ఆందోళన చేస్తున్న డాక్టర్లు పంతం వీడలేదు. మమతా బెనర్జీ సర్కార్ ముందు ఐదు డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లు నెరవేరిస్తేనే ఆందోళన ముగిస్తామని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి కోల్‌కతాలో డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తీశారు జూనియర్ డాక్టర్లు. సుప్రీంకోర్టు తీర్పు తమకు తీవ్ర నిరాశను కలిగించిందన్నారు డాక్టర్లు. హెల్త్ సెక్రటరీ, హెల్త్ డెరెక్టర్‌ను తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. అలాగే, కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను తొలగించాలని, అన్ని ఆస్పత్రుల్లో సీసీటీవీలు పెట్టాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపర్చాలని స్వాస్థ్ భవన్ వరకు డాక్టర్లు ర్యాలీ తీశారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల లోగా విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని డాక్టర్లు ప్రకటించారు. విధుల్లో చేరిన డాక్టర్లపై ఎలాంటి చర్యలు ఉండవని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆందోళనపై బెంగాల్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.. మరోవైవు అవినీతి కేసులో అరెస్టయిన ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు సెప్టెంబర్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఆస్పత్రి నిధులను దారి మళ్లించారని సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది.
ఇదిలావుంటేచ ఆగస్టు 9 తెల్లవారుఝామున కోల్‌కతా నగరమే కాదు.. యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసిన ఘటన. ఆర్జీకార్ ఆస్పత్రిలో మహిళా జూనియర్ డాక్టర్‌పై దారుణ హత్యాచారం జరిగి సరిగ్గా నెలరోజులు గడిచింది. ఇప్పటికీ దాని తాలూకు ప్రకంపనలు చల్లారనేలేదు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నా.. కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లినా… సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నా.. నిరసన హోరుతో బెంగాల్ మొత్తం ఉడికిపోతోంది.