ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటారు. ఆయన ట్వీట్లతో తరుచూ వివాదాలు సృష్టిస్తారు. తాజా సుప్రీం కోర్టు వీధి కుక్కల వివాదంపై ఆయన రియాక్ట్ అవుతూ వరుసగా వీడియోలు పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆర్జీవీ Xలో ఓ వీడియో పోస్ట్ చేసి దాని కింద క్యాప్షన్ ఇలా రాశారు.. “కుక్కల ప్రేమికులందరికీ… సుప్రీంకోర్టు తీర్పుపై గగ్గోలు పెడుతున్న వారికి… ఈ వీడియో చూడండి. నడిబొడ్డున పగలు వీధి కుక్కలు ఓ నాలుగేళ్ల బాలుడిని ఎలా చంపాయో చూడండి” అంటూ రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్వీట్లో సుప్రీంకోర్టు(Supreme Court) ఇటీవల వీధి కుక్కలను తరలించాలని ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో జంతు ప్రేమికులు చేస్తున్న విమర్శలను ఆయన వ్యతిరేకించారు.
ఢిల్లీలో వీధి కుక్కలు(Delhi in Stray Dogs) తరలించాలని సుప్రీం కోర్టు ఆదేశాలను కొందరు సినీ సెలబ్రెటీలు తప్పబట్టారు. సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నటి జాన్వీ కపూర్, వరుణ్ ధావన్, రవీనా టాండన్, సిద్ధార్థ్ ఆనంద్ వంటి ప్రముఖులు సుప్రీంకోర్టు ఆదేశాన్ని సోషల్ మీడియాలో ఖండించారు. అలాగే యాక్టర్ జాన్ అబ్రహం కూడా CJI జస్టిస్ బి.ఆర్. గవాయికి ఒక అప్పీల్ పంపారు. ఆ ఆదేశాలను సమీక్షించాలని కోరారు. తన లేఖలో, జాన్ అబ్రహం వీధి కుక్కలను “కమ్యూనిటీ డాగ్స్” అని, “ఢిల్లీ పౌరులే” అని అభివర్ణించారు. అంతేకాదు హిరోయిన్ సదా వీధి కుక్కలను తరలించవద్దని బోరున ఏడుస్తూ వీడియో చేశారు. వీరందరినీ ఆర్జీవీ ఈ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
ఈ ట్వీట్తో పాటు, ఆయన ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగిన హృదయ విదారక ఘటన ఉంది. ఒక నాలుగేళ్ల బాలుడు వీధుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా, మూడు వీధి కుక్కలు అతనిపై దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ భయానక వీడియోను ప్రస్తావిస్తూ, వీధి కుక్కల సమస్యపై ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఢిల్లీ-NCR ప్రాంతంలో వీధి కుక్కలను శాశ్వతంగా వాటి ఆశ్రయాలకు తరలించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై జంతు సంక్షేమ సంస్థలు, జంతు ప్రేమికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కుక్కలను తరలించడం అమానవీయం, ఆచరణ సాధ్యం కాదని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్తో ఈ చర్చలో భాగమయ్యారు. ప్రజల భద్రత, ముఖ్యంగా చిన్నారుల భద్రత వీధి కుక్కల సమస్య ముందు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశమని ఆయన వాదన.
మొత్తంగా, ఆర్జీవీ ట్వీట్ వీధి కుక్కల సమస్యపై రెండు వర్గాల మధ్య ఉన్న తీవ్రమైన విభేదాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఒకవైపు జంతు హక్కుల కార్యకర్తలు, మరోవైపు ప్రజల భద్రతను కోరుకునే వారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది.






























