దేశంలో తొలిసారి రైస్ ఏటీఎం.. డబ్బులు డ్రాచేసినట్టు బియ్యం తీసుకోవచ్చు

www.mannamweb.com


దేశంలోనే తొలిసారిగా రైస్ ఏటీఎంను ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ కార్డుదారుడు ఈ ఏటీఎం ద్వారా 25 కిలోల వరకు బియ్యాన్ని పొందవచ్చు. ఒడిశా ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్ర గురువారం రైస్ ఏటీఎంను ఆవిష్కరించారు. కార్డుదారుడు బయోమెట్రిక్ చేసిన అనంతరం ఏటీఎం స్క్రీన్‌పై రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేస్తే 25 కేజీల వరకు బియ్యాన్ని పొందవచ్చని ఆయన తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద భారీ క్యూలను నివారించేందుకు ఈ ఏటీఎంను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

అంతేకాదు, నిజమైన లబ్దిదారులు మాత్రమే ఈ బియ్యం తీసుకునే వీలు కలుగుతుందని ఆయన అన్నారు. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టు పడుతుందని, . కొలతల్లో సైతం ఎటువంటి తేడా కానీ, మోసాలు కానీ ఉండవని మంత్రి స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఏటీఎం ఏర్పాటు చేశామని, దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఇదేనని మంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని 30 జిల్లాల్లో ఈ తరహా ఏటీఎంలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒన్ నేషన్ ఒన్ కార్డు పథకంలో భాగంగా విస్తరించవచ్చని అన్నారు.

వీటిని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఎక్కడ కావాలంటే అక్కడ బియ్యం తీసుకోవచ్చునని మంత్రి కృష్ణ చంద్ర అభిప్రాయపడ్డారు. వన్ నేషన్ వన్ రేషన్ పథకం ద్వారా రేషన్ కార్డు లబ్దిదారులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల బోగస్ రేషన్ కార్డులు చెలామణిలో ఉన్నాయని, దీనికి బాధ్యులైన అధికారులు, పీడీఎస్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పాత్రా గత నెలలో హెచ్చరించారు. ప్రస్తుతం దాదాపు 25 లక్షల కార్డులను గుర్తించామని, మిగిలిన వాటిని గుర్తించేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు.

‘తప్పుడు రేషన్ కార్డులను తొలగించిన తర్వాత… మునుపటి బీజేడీ ప్రభుత్వం రాజకీయాలల కారణంగా కార్డులు కోల్పోయిన అర్హులకు ఆహార భద్రత ప్రయోజనాన్ని విస్తరించడానికి చర్యలు తీసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, వాస్తవానికి 2022లోనే అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ తరహా ఏటీఎంలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇందుకోసం 2021లో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం (WFP)తో అవగాహన ఒప్పందం కుదురుచ్చుకుంది. స్మార్ట్ మొబైల్ స్టోరేజీ యూనిట్లు ఒప్పందం కింద పంపిణీ వ్యవస్థను మార్చడం, ధాన్యం సేకరణ, రైస్ ఏటీఎంలు ఏర్పాటు వంటి ప్రాజెక్టులు చేపట్టింది.