Road Robbery : నంద్యాల శివారులో రెచ్చిపోయిన దారి దోపిడి దొంగలు

నంద్యాలలో దారి దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. శివారుప్రాంతాల్లో మాటువేసి దారి వెంట వెళ్లేవారిపై దాడి చేసి అందినకాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు.


ఈ క్రమంలోనే రైతునగర్ వద్ద వాహనదారుడి పై దొంగలు దాడి చేసి దోచుకున్నారు. దారిలో వెళ్తున్న కారుపై రాళ్లతో దాడిచేసిన దుండగులు కారు ఆపగానే డ్రైవర్ ప్రభాస్ పై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. దీంతో ప్రభాస్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ప్రభాస్ ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముసుగులు ధరించిన దొంగలు దాడికి పాల్పడ్డట్టు బాధితుడు తెలిపాడు. కాగా నంద్యాల తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నంద్యాల రహదారిలో ఈ మధ్యకాలంలో మరుసగా దారి దోపిడీలు జరగడం సంచలనం రేపుతోంది.

కాగా కర్నూలు-నంద్యాల రహదారిలో శాంతిరామ్ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై గత ఆదివారం రాత్రి దారిదోపిడీ దొంగలు దంపతులపై దాడి చేశారు. భార్యాభర్తలపై కత్తులతో దాడిచేసిన దొంగలు వారిని తీవ్రంగా గాయపరిచారు. పాణ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన దామరేకుల పెద్దన్న, జయమ్మ దంపతుల కుమార్తె గర్బిణీ కావడంతో చికిత్సకోసం ఆదివారం శాంతిరాం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్ల సూచన మేరకు రాత్రి అక్కడే ఉంచారు. జయమ్మ బహిర్బూమి కోసం భార్యభర్తలు ఆసుపత్రి సమీపంలోని ఓ పొలం వద్ద ఆగిఉండగా అక్కడే ఉన్న దొంగలు ముందుగా పెద్దన్నపూ కత్తితో తల, కాళ్లపై దాడిచేశారు. దీంతో తీవ్ర రక్తస్రావమై అక్కడే పడిపోయాడు. అనంతరం కేకలు వేస్తున్న జయమ్మను చితక బాదారు. ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ను లాక్కుని పరారయ్యారు.అతికష్టం మీద భర్తను తీసుకుని ఆసుపత్రికి చేరుకుంది. కాగా వారికి ఆస్పత్రి వర్గాలు చికిత్స అందించాయి. ఈ ఘటన జరిగి వారం కాక ముందే మరోసారి దారి దోపిడి జరగడం కలకలం రేపింది.