హిట్‌మ్యాన్ హిస్టరీ.. సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. 38 ఏళ్ల వయసులో అదుర్స్.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్

అంతర్జాతీయ క్రికెట్‌లో తన భవిష్యత్తుపై ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించాడు.


తన కెరీర్‌లో తొలిసారిగా ఐసీసీ పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచిన ప్రస్తుత భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి రోహిత్ ఈ స్థానాన్ని దక్కించుకున్నాడు.

సచిన్ రికార్డు బ్రేక్

38 సంవత్సరాల 182 రోజుల వయసులో ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్న రోహిత్ శర్మ.. ఏదైనా ఫార్మాట్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న అత్యంత పెద్ద వయస్కుడైన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2011లో 38 సంవత్సరాల 73 రోజుల వయసులో టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో ఉన్న ఒక ఆటగాడికి ఇది అరుదైన ఘనత. వన్డే బ్యాటింగ్ చార్టులలో రోహిత్ అగ్రస్థానంలో నిలవడం అతని కెరీర్ లో ఇదే మొదటిసారి.

టాప్ స్కోరర్

టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ సిరీస్‌లో రోహిత్ మూడు ఇన్నింగ్స్‌లలో 202 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిడ్నీ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీతో భారత్‌కు తొమ్మిది వికెట్ల విజయాన్ని అందించాడు. అతనికిది 33వ వన్డే సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ సెంచరీ.

గిల్ ను దాటి

తాజా ఫామ్‌తో రోహిత్ 36 రేటింగ్ పాయింట్లు సాధించి 741 నుండి 781 పాయింట్లకు చేరుకున్నాడు. ప్రస్తుత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను దాటి నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2023 చివరి నుంచి అగ్రస్థానంలో ఉన్న గిల్.. ఇప్పుడు రోహిత్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇబ్రహీం జద్రాన్ తర్వాత మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాపై గిల్ మూడు మ్యాచ్‌లలో కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనను వరుస డకౌట్‌లతో ప్రారంభించిన విరాట్ కోహ్లి.. మూడో వన్డేలో అజేయంగా 74 పరుగులు చేశాడు. అతను ర్యాంకింగ్స్ లో ఒక ప్లేస్ కోల్పోయి ఆరో స్థానంలో నిలిచాడు.

అప్పుడు నెంబర్ టూ

2019 ప్రపంచ కప్‌లో రోహిత్ తన కెరీర్‌లో నెం. 2 ర్యాంక్‌ను సాధించాడు. ఆ టోర్నమెంట్‌లో అతను రికార్డు స్థాయిలో ఐదు సెంచరీలు చేసి 882 పాయింట్ల గరిష్ట రేటింగ్‌కు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అతను నెం.1గా ఎదగడం మరింత విశేషం. ఈ ముంబై ఓపెనర్ ఆస్ట్రేలియా గడ్డపై తన పేరు మీద అనేక కొత్త రికార్డులను లిఖించుకున్నాడు.

  • భారత ఓపెనర్‌గా అత్యధిక పరుగులు- భారత ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో వీరేంద్ర సెహ్వాగ్ (15,758 పరుగులు) రికార్డును అధిగమించాడు. సెహ్వాగ్ కన్నా 11 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి ఈ ఘనత సాధించాడు.
  • భారత ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు- ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ చేసిన 45 అంతర్జాతీయ సెంచరీల రికార్డును సమం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా డేవిడ్ వార్నర్ (49) మాత్రమే అతని కంటే ముందున్నాడు.
  • ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు- ఆసీస్‌పై తొమ్మిది సెంచరీలతో టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. అయితే, టెండూల్కర్ 70 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, రోహిత్ కేవలం 49 ఇన్నింగ్స్‌లలోనే సాధించాడు.
  • వన్డే సెంచరీ చేసిన రెండో పెద్ద వయస్కుడైన భారతీయుడు: సిడ్నీలో 38 సంవత్సరాల 178 రోజుల వయసులో సెంచరీ చేసి టెండూల్కర్ (38y 327d) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
  • సేనా (SENA) దేశాలలో అత్యధిక వన్డే సెంచరీలు: ఈ దేశాలలో తన సెంచరీల సంఖ్యను 14కి పెంచుకున్నాడు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.