ROSA – Recognition of Service Association – ఇక రోసా కత్తి… ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తే వేటు వేయడమే…అసలు ఏమిటీ రోసా..

????ఇక రోసా కత్తి


????ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తే వేటు వేయడమే

????ఏపీజీఈఏతో మొదలుపెట్టిన జగన్‌ సర్కారు

????భవిష్యత్తులో ఇతర సంఘాలపైనా అదే తీరు!?

????మీడియాతో మాట్లాడటమే నేరమట..

????పెన్షన్లు, జీతాలు ఇవ్వకున్నా అడగొద్దు!

????దశాబ్దాలుగా ఉన్న ‘రోసా’ నిబంధనలు..

????తొలిసారి ప్రయోగించిన జగన్‌ ప్రభుత్వం..

(ఆంధ్రజ్యోతి – అమరావతి): అనుకున్నదే జరుగుతోంది! ఉద్యోగుల సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించి… సర్కారు తీరును ఎండగట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ)పై జగన్‌ ప్రభుత్వం ‘రోసా’ కత్తి దూసింది. ‘జీతం ఠంచనుగా ఇవ్వండి’ అని అడగడమే నేరమైనట్లుగా దశాబ్దాల కిందట రూపొందించిన ‘రోసా’ (రికగ్నిషన్‌ ఆఫ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌) నిబంధనలను బయటికి తీసింది. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ నోటీసు జారీ చేసింది. జీతాలు, డీఏలు, జీపీఎ్‌ఫలు ఇచ్చినప్పుడే తీసుకోవాలని, కాదూ కూడదని ప్రశ్నిస్తే సహించేది లేదని అన్ని ఉద్యోగ సంఘాలకూ హెచ్చరికలు పంపింది.

దెబ్బతిన్న సర్కార్‌ అహం

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సూర్యనారాయణ, ఆస్కార్‌రావు, ఇతర ప్రతినిధులు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను నేరుగా కలిశారు. ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు ఇచ్చేలా చట్టం చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా ఆదేశించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై గవర్నర్‌ కూడా స్పందించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించారు. ఈ పరిణామాలు జగన్‌ సర్కారును ఇరకాటంలోకి నెట్టాయి. ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి కారణమయ్యాయి. అయితే… గవర్నర్‌ను కలిసినందుకు అని కాకుండా, ‘మీడియాతో మాట్లాడి, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసినందుకు’ అని నోటీసులో పేర్కొనడం గమనార్హం. రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు 104 ఉన్నాయి. వాటి ప్రతినిధులు సందర్భం వచ్చినప్పడల్లా మీడియాతో మాట్లాడుతుంటారు. తమ డిమాండ్లు వినిపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నిలదీయడమూ సహజమే. ఏపీజీఈఏ నేతలు కూడా గతంలో అనేక పర్యాయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ… ఇప్పుడే ‘రోసా’ కింద ఈ సంఘానికి నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇప్పుడు ఏపీజీఈఏకు ఇచ్చిన నోటీసులు… భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇతర ఉద్యోగ సంఘాలకూ ఇవ్వొచ్చు. వెరసి… అందరి మీదా ‘రోసా’ కత్తి వేలాడుతూనే ఉంటుందని ఉద్యోగ నేతలు పేర్కొంటున్నారు.

కానరాని ఉద్యోగ సంఘాల ఐక్యత….

ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఐక్యంగా పోరాడిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులు తమ సమస్యల కోసం ఉమ్మడి ఉద్యమాలు చేపట్టారు. ఇప్పుడు దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఐక్యంగా ప్రభుత్వంపై పోరాడే సంగతి పక్కనపెడితే… వాళ్లే ఒకరిమీద ఒకరు పోరాడుకుంటున్నారు. ‘‘ఏపీజీఈఏ అధ్యక్షుడు సూర్యనారాయణతో ఇతర ఉద్యోగ సంఘాలకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఆయన మాట్లాడింది ఉద్యోగ సమస్యలపైనే. గవర్నర్‌ను కలిసింది ఉద్యోగుల కోసమే! ప్రభుత్వం దీనిని జీర్ణించుకోలేక ఏపీజీఈఏకు నోటీసులు జారీ చేసింది. ఇతర సంఘాలు దీనిని ఖండించాల్సిందే. అలాకాదని వదిలేస్తే… భవిష్యత్తులో వారి వంతూ వస్తుంది. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది సాధారణ ఉద్యోగులే’’ అనే దిశగా ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

అసలు ఏమిటీ రోసా..

సర్వీసు అసోసియేషన్లకు గుర్తింపు, రద్దుకు సంబంధించి1962లో రికగ్నిషన్‌ ఆఫ్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ (రోసా) నిబంధనలు రూపొందించారు. తర్వాత 2001 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఏపీలో రూల్స్‌ను సవరించారు. ఏ అసోసియేషన్‌కు గుర్తింపు ఇవ్వాలన్నా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా, రద్దు చేయాలన్నా ఈ నిబంధనలే వర్తిస్తాయి. రోసా నిబంధనల ప్రకారం… ఉద్యోగ సంఘ సమావేశాల వివరాలను సభ్యులకు మాత్రమే చెప్పాలి. ఇతరులకు, మీడియాకు వెల్లడించకూడదు అని మాత్రమే రోసా రూల్స్‌లో ఉంది. ఏపీజీఏఈపై ఈ నిబంధననే ప్రభుత్వం ప్రయోగించింది. ‘రోసా క్లాజ్‌ 2 బీ అండ్‌ 3 ప్రకారం… పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మీ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదు?’ అని ఏపీజీఈఏను ప్రభుత్వం ప్రశ్నించింది. నిజానికి… రోసా నిబంధనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ… ఏ ప్రభుత్వమూ వీటిని అమలు చేయలేదు. ఇప్పుడు ప్రశ్నించే గొంతులను అణచివేయడమే లక్ష్యంగా ‘రోసా’ రూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం బయటికి తీసిందని, దీనిని అమలు చేస్తే ఏ సంఘమూ నోరెత్తే పరిస్థితి ఉండదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.