దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపదను ఊహించని రీతిలో పెంచే మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎన్నో ఉంటాయి. వీటిని కనిపెట్టడమే కాస్త కష్టం. అయితే ఒక్కసారి దొరికితే ఇక వదిలేయలేరు.
అలా వరుసగా పెరుగుకుంటూ పోతూనే ఉంటాయి. షేరు అసలు ధరకు కొన్నేళ్లలోనే ఎన్నో రెట్లు పెరిగితే దానిని మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. వీటిని కనిపెట్టాలంటే ముందు నుంచే ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు ఇలా అన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇంకా ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని సరైన సమయంలో సరైన స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే కొన్నేళ్లలో అద్భుతమైన లాభాలు అందుకోవచ్చు. ఇలా మంచి లాభాలు అందించిన మల్టీబ్యాగర్ గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదే పీటీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది ఐదేళ్ల కాలంలోనే ఏకంగా 7500 శాతం పెరిగింది. అంటే ఐదు సంవత్సరాల కిందట ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ఇప్పుడు అది రూ. 76 లక్షలకు చేరిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 11,507 గా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ స్టాక్ 77 శాతం పెరిగింది. ఇక ఏడాది వ్యవధిలో చూస్తే 102 శాతం పుంజుకుంది. దీంతో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందాయి.
ఇక 2019 డిసెంబర్ నెలలో చూస్తే ఈ స్టాక్ ధర రూ. 150 వద్ద ఉండగా.. ఇప్పటివరకు అంటే ఐదేళ్లలో ఏకంగా 75 రెట్ల రిటర్న్స్ అందాయి. అంటే 5 సంవత్సరాలలో రూ. 150 నుంచి రూ. 11,500 స్థాయికి పెరిగింది. ఈ క్రమంలోనే 2019లో ఇందులో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు చేతికి రూ. 76 లక్షల వరకు వచ్చాయని చెప్పొచ్చు.
ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఈ స్టాక్‌పై ఆసక్తి చూపిస్తున్నారని.. అందుకే కొనుగోళ్లు పెరుగుతున్నాయని.. ఇంకా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటీవల పీటీసీ ఇండస్ట్రీస్.. ట్రాక్ ప్రిసిషన్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసింది. దీని గురించి డిసెంబర్ 19న సంస్థ ప్రకటన చేసింది. దీని ప్రకారం.. ట్రాక్ ప్రిసిషన్ సొల్యూషన్స్ కంపెనీలో 100 శాతం వాటా దక్కించుకుంది. ఈ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ 2024, అక్టోబర్ 18న జరిగింది. పలు బ్రోకరేజీలు కూడా దీనికి బై రేటింగ్ ఇస్తున్నాయి. టార్గెట్ ప్రైస్ పెంచేస్తున్నాయి. అయితే ఏ స్టాక్ అయినా ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తేనే రిస్క్ లేకుండా రిటర్న్స్ అందుకోవచ్చు.