ఫ్లైట్ జర్నీ ఎక్స్ పీరియన్స్ చేయాలని ప్రతి ఒక్కరు కలలుకంటుంటారు. ఒక్కసారైనా విమానంలో విహరించాలని భావిస్తుంటారు. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే విమాన టికెట్ ధరలు వేలకు వేలు ఉండడమే దీనికి గల కారణం. అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి విమానం ఎక్కలేక.. అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు ఆ ఆశను వదిలేసుకుంటారు. డబ్బున్న వారికైతే విమాన ప్రయాణం పెద్ద కష్టమేమీ కాదు. అయితే విమానం ఎక్కాలనే కోరిక ఉండి.. టికెట్ ధరల కారణంగా ఆ ఆలోచనను విరమించకుంటున్న వారికి, టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్ ను అందించింది.
బస్ టికెట్ ధరలకే ఫ్లైట్ టికెట్ ను ఆఫర్ చేస్తోంది ఎయిర్ ఇండియా. కేవలం రూ. 932తోనే విమాన ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంది. తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ వస్తుండడంతో మీ ఫ్లైట్ జర్నీ కోరికను తీర్చుకోవచ్చు. మరి ఈ ఆఫర్ ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఏయే నగరాల్లో వర్తిస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ లైట్ ప్రత్యేక ఆఫర్ ద్వారా చాలా తక్కువ ధరకే విమాన ప్రయాణాలు కల్పిస్తోంది. లిమిటెడ్ టైమ్ ఫ్లాష్ సేల్ పేరిట దీనిని తీసుకొచ్చింది. ఎక్స్‌ప్రెస్ లైట్ టికెట్ల ప్రారంభ ధర రూ. 932 గా ఉంది.
ఈ స్పెషల్ సేల్ కింద టికెట్స్ బుక్ చేసుకునేందుకు చివరి తేదీ 2024, సెప్టెంబర్ 16. సెప్టెంబర్ 16 లోగా టికెట్స్ బుక్ చేసుకున్న వారు 2025, మార్చి 31 వరకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. ఎయిరిండియా మరో ఆఫర ను ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ లైట్ తో పాటు ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఆఫర్ ను అందుబాటులో ఉంచింది. ఎక్స్ ప్రెస్ వాల్యూ ధరలు రూ. 1088 నుంచి ప్రారంభం అవుతున్నాయి
కాగా ఈ ఆఫర్లు ఢిల్లీ- గ్వాలియర్, కొచ్చి- బెంగళూరు, బెంగళూరు- చెన్నై వంటి మార్గాల్లో వర్తిస్తాయి. వచ్చేది పండగల సీజన్ కాబట్టి ఉద్యోగ, ఉపాధి దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారు సోంతూళ్లకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన ఆఫర్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. స్టూడెంట్స్, ఎస్ఎంఈలు, డాక్టర్లు, నర్సులు, సీనియర్ సిటిజెన్లు, సాయుధ దళాలు సహా వీరిపై ఆధారపడిన వారు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఛార్జీలపై కంపెనీ వెబ్‌సైట్లో బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది.