రూ. 10 లక్షల ఆదాయంపైనా నో టాక్స్.. పక్కా ప్లాన్‌తో ఇలా చేస్తే చాలు.. బెటర్ ఆప్షన్

www.mannamweb.com


New Tax Regime vs Old Tax Regime: 2024 బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపు దారులు కొత్త పన్ను విధానం ఎంచుకునేందుకు సులభతరం చేస్తూ నిర్ణయాలు ప్రకటించింది. దీని కింద కొత్త పన్ను విధానంలోనే స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచింది. ఇంకా పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు చేసింది. గతంలో రూ. 3-6 లక్షల వరకు టాక్స్ శ్లాబ్ ఉండగా.. దీనిని రూ. 7 లక్షల వరకు పెంచింది. అదే విధంగా రూ. 6-9 లక్షలకు ఒక శ్లాబ్ ఉండగా.. దీనిని రూ. 7-10 లక్షలకు చేసింది. దీంతో రూ. 6-7 లక్షలు, రూ. 9-10 లక్షల ఇన్‌కం బ్రాకెట్‌పై టాక్స్ తగ్గించుకోవచ్చు. అధిక ఆదాయంపైనా టాక్స్ తగ్గుతుంది. ఈ విధానంతో కొత్త ఆదాయపు పన్ను విధానం కింద గరిష్టంగా రూ. 7.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది.

అయితే ఇదే సమయంలో రూ. 10 లక్షల ఆదాయంపై కొత్త పన్ను విధానంలో అంతకుముందు రూ. 52,500 వరకు టాక్స్ చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు మార్పుల తర్వాత రూ. 42,500 కు తగ్గింది. అంటే రూ. 10 వేలు ఆదా అవుతుంది. ఇక్కడే పాత పన్ను విధానం ఎంచుకుంటే రూ. 10 లక్షల ఆదాయంపై రూపాయి పన్ను చెల్లించాల్సిన అవసరం కూడా లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.

కొత్త పన్ను విధానంతో పోలిస్తే పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులకు ఆస్కారం ఉంటుంది. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగానే ఉన్నప్పటికీ.. పన్ను తగ్గించుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పన్ను మినహాయింపు కల్పించే పెట్టుబడులు ఇందుకు కారణం.
ముందుగా రూ. 10 లక్షల ఆదాయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలు తీసేస్తే రూ. 9.50 లక్షలవుతుంది. దీనిపై పన్ను లెక్కిద్దాం.

సెక్షన్ 80c- పీపీఎఫ్, ఈపీఎఫ్, ELSS సహా ఇతర టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను తగ్గించుకోవచ్చు. ఐదేళ్ల టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఇందులోకి వస్తాయి. అప్పుడు రూ. 9.50 లక్షల నుంచి రూ. 1.50 లక్షలు తీసేస్తే.. రూ. 8 లక్షలవుతుంది.

సెక్షన్ 80CCD (1B) – సెక్షన్ 80C కింద రూ.1.50 లక్షలు మినహాయించిన తర్వాత.. దీనికి అదనంగా NPS టైర్-1 ఖాతాకు కాంట్రిబ్యూషన్ల ద్వారా ఈ సెక్షన్‌తో అదనంగా రూ. 50 వేలు పన్ను మినహాయింపు పొందొచ్చు. అప్పుడు రూ. 50 వేలు మినహాయించిన తర్వాత ఆదాయం రూ. 7.50 లక్షలవుతుంది.

హోం లోన్ వడ్డీ- సెక్షన్ 24B ద్వారా హోం లోన్ వడ్డీ మినహాయించుకోవచ్చు. గృహ యజమానులు ఈ సెక్షన్ కింద హోం లోన్‌పై చెల్లించిన వడ్డీపై రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది పన్ను భారాన్ని తగ్గిస్తుందని చెప్పొచ్చు. అప్పుడు రూ. 7.50 లక్షల నుంచి రూ. 2 లక్షలు తీసేస్తే రూ. 5.50 లక్షలవుతుంది.

మెడికల్ ఖర్చులు- సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం ద్వారా పన్ను మినహాయింపునకు అర్హులు. మీరు, మీ లైఫ్ పార్ట్‌నర్‌కు, మీపై ఆధారపడిన పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మీరు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని రూ. 25 వేల వరకు తగ్గించుకోవచ్చు. మీరు లేదా మీ జీవిత భాగస్వామి సీనియర్ సిటిజెన్ అయితే అదనంగా మరో రూ. 25 వేలు మినహాయింపు పొందొచ్చు. ఇలా మీ ఆదాయం రూ. 5 లక్షల దిగువకు చేరుతుంది.

ఇక పాత పన్ను విధానంలో రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయంపై సెక్షన్ 87A కింద టాక్స్ రిబేట్ వర్తిస్తుంది. దీంతో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. అయితే ఇవన్నీ మినహాయింపులు పొందితేనే టాక్స్ ఆదా చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ మినహాయింపులు మాత్రం లేవు.