మహిళలకు భారీ షాక్‌.. తెలంగాణలో ఆర్టీసీ ఫ్రీ బస్సు బంద్‌?

తెలంగాణ మహిళలకు త్వరలోనే భారీ షాక్‌ తగలనున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్టు చర్చ జరుగుతోంది.


తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగులు అందరూ సమ్మెకు దిగితే ఉచిత బస్సు ఆగిపోతుందనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ప్రస్తుతం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రెండు పీఆర్‌సీలు బకాయి పడడం.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం హామీలను రేవంత్‌ రెడ్డి విస్మరించింది. ఉద్యోగులను నమ్మించి నట్టేటా మోసం చేయడంతో ప్రస్తుతం ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 14 నెలలు గడిచినా కూడా తాత్సారం చేస్తుండడంతో ఇక సహించేది లేదంటూ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు.

నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇప్పటికే సమ్మె నోటీసును ఆర్టీసీ యాజమాన్యానికి టీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు అందించారు. తమ 21 డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ‘ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 జీతభత్యాల సవరణ, కండక్టర్‌ డ్రైవర్ల ఉద్యోగ భద్రత, విద్యుత్‌ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీ కొనుగోలు చేసి ఇవ్వాలి’ అని ప్రధాన డిమాండ్లు కార్మిక సంఘాలు చేస్తున్నాయి.

ప్రభుత్వం పరిష్కరించకపోతే మాత్రం వచ్చే వారం 9వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె ఉండేట్టు స్పష్టంగా పరిణామాలు ఉన్నాయి. దీంతో ఒకవేళ సమ్మెకు గనుక ఆర్టీసీ ఉద్యోగులు వెళ్తే రోడ్డుపై ఆర్టీసీ బస్సులు తిరగవు. దీని ప్రభావంతో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం అనేది కొనసాగదు.

సమ్మెకు వెళ్లితే..
ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంతో వెంటనే తక్షణ ఏర్పాట్లలో భాగంగా ప్రైవేటు బస్సులు నడుపుతారు. వాటిలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే అవకాశం ఉండదు. ఏది ఏమైనా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే మాత్రం మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది ఆగిపోతుంది. ఈ వార్తతో తెలంగాణ మహిళలు ఆందోళన చెందుతున్నారు. అయితే సమ్మె జరుగుతుందా? ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ఆగుతుందా? అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.