విశాఖ పర్యటనలో రుషికొండ కట్టడాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..విలాసాల కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకున్నారని మండిపడ్డారు. రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదన్న ముఖ్యమంత్రి…వందల కోట్ల ప్రజాధనంతో వ్యక్తిగత విలాసాల కోసం కట్టిన ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నామన్నారు.
ఈ మేరకు సలహాలు-సూచనలను ఇవ్వాలంటూ ప్రజలకు సూచించారు.
వైసీపీ హయాంలో రూ.500 కోట్ల ఖర్చుతో నిర్మాణాలు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.500 కోట్లు ఖర్చు చేసి రుషికొండపై ఏడు బ్లాక్‌ల్లో భవనాలు నిర్మించారు. అయితే జగన్ ప్రభుత్వం ఓటమి పాలవడంతో..ఈ భారీ భవనాలు చర్చనీయాంశమయ్యాయి. గత నాలుగు నెలలుగా ఇక్కడి భవనాలు, ఉద్యానవనాల నిర్వహణ, విద్యుత్ వినియోగం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుండడంతో.. దీనిపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం.
మరోవైపు రుషికొండ భవనాలను ఏపీ రాష్ట్ర మ్యూజియంగా మార్చాలంటోంది..బుద్దిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటక్షన్ కమిటీ. ఉత్తరాంధ్రలో లభించిన బౌద్ధ అవశేషాలను భవనాల్లో ప్రదర్శనకు ఉంచాలని చెబుతోంది. జాతీయ-అంతర్జాతీయ సెమినార్ల కోసం పరిశోధకులకు కావలసిన సాంకేతిక సౌకర్యాలు కల్పించేలా భవవాలను వాడుకోవాలని ప్రభుత్వానికి ఆ సంస్థ సూచిస్తోంది.
గతంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం రుషికొండలో భవనాలను నిర్మించినట్టు ప్రచారం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వం ఓటమిపాలవడంతో.. ఇప్పుడు వాటిని కూటమి సర్కార్ ఎలా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రుషికొండలో భవనాలను చూసి ఆశ్చర్యపోతున్న చంద్రబాబు.. అమరావతిలో అలాంటి భవనాలు ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నిస్తోంది..వైసీపీ. రుషికొండలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ మండిపడుతోంది.
నిర్వహణపరంగా చూస్తే రుషికొండ భవనాలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో.. ఈ భవనాలను ఏం చేయాలి? ఏ విధంగా ఉపయోగించాలి? అనే విషయాలపై ప్రభుత్వం ప్రస్తుతం దృష్టిపెట్టింది. మరోవైపు భవనంపై వివిధ సంఘాలు పలు సూచనలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. మరి దీనిపై కూటమి సర్కారు ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.