‘సాగర్‌ టూ శ్రీశైలం’.. కృష్ణా నది అలలపై అందాల ప్రయాణం మొదలైంది.

www.mannamweb.com


నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు కృష్ణ నదిలో బోటులో ప్రయాణం.. చుట్టూ ప్రకృతి అందాలు, చల్లటి గాలి ఊహించుకోవడానికే ఎంతో అద్భుతంగా ఉంది కదూ! ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ అద్భుత క్షణం రానే వచ్చేసింది.

పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బోటు ప్రయాణం అందుబాటులోకి వచ్చేసింది.

తెలంగాణ టూరిజం ఈ టూర్‌ ప్యాకేజీని ప్రారంభించింది. కార్తీక మాసం తొలి రోజును పురస్కరించుకొని అధికారులు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజానికి గడిచిన కొన్నేళ్ల నుంచి ఈ బోటును నడిపించేందుకు ప్రణాళికలు వేశారు. అయితే కరోనా, ఆ తర్వాత సరైన వర్షాలు లేని కారణంగా బోటు ప్రయాణం వీలుపడలేదు. అయితే తాజాగా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు గరిష్ఠ స్థాయిలో నీరు అందుబాటులో ఉండడంతో బోటు ప్రయాణాన్ని ప్రారంభించింది.

సుమారు 120 కిలోమీటర్ల మేర ఈ ప్రయాణం ఉంటుంది. నాగార్జున సాగర్‌లో ప్రారంభమయ్యే ఈ బోటు ప్రయాణం నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాతాల మీదుగా ఉంటుంది. ఇక మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఇవాళ ప్రారంభించారు.

ప్యాకేజీ వివరాలు..

ప్యాకేజీ ధర విషయానికొస్తే.. బోటు ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. పూర్తి వివరాలు, బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించాలని అధికారులు తెలిపారు. అయితే.. నాగార్జునసాగర్‌ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నేరుగా హైదరాబాద్ నుంచి కూడా టూర్ ఆపరేట్ చేస్తున్నారు.