ఈ ఏడాదిలో దేశీయ పరిశ్రమల్లో ఉద్యోగుల సగటు వేతన పెంపు 9.4 శాతంగా ఉండొచ్చని హెచ్‌ఆర్ కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ అంచనా వేసింది. బలమైన ఆర్థికాభివృద్ధి, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు పెరుగుతున్న గిరాకీని ఇది సూచిస్తోందని వెల్లడించింది. గత అయిదేళ్లలో వేతనాలు స్థిరంగా పెరుగుతున్నాయని, 2020లో 8% పెరగ్గా, 2025లో ఇది 9.4 శాతానికి చేరొచ్చని టోటల్ రెమ్యూనరేషన్ సర్వేలో సంస్థ పేర్కొంది. దేశంలో 1550కు పైగా కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్జూమర్ గూడ్స్, ఆర్థిక సేవలు, తయారీ, ఆటోమోటివ్, ఇంజినీరింగ్ రంగాల కంపెనీలు ఇందులో ఉన్నాయి.
ఆటోమోటివ్ రంగంలో వేతనాల పెంపు అత్యధికంగా 10% ఉండొచ్చని అంచనా. 2020లో ఇది 8.8 శాతంగా ఉంది. విద్యుత్ వాహనాలు, భారత్‌లో తయారీ కార్యక్రమాలు ఇందుకు దోహదపడ్డాయి. తయారీ, ఇంజినీరింగ్ రంగాల్లో వేతనాల వృద్ధి 8% నుంచి 9.7 శాతానికి చేరనుంది.
2025లో ఉద్యోగులను పెంచుకోవడానికి చూస్తున్నట్లు 37% కంపెనీలు తెలిపాయి.