ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..
ఉద్యోగుల సంక్షమంపై దృష్టి సారించింది. దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో తాజా నిర్ణయం తీసుకుంది.
సచివాలయం, వివిధ శాఖలు, విభాగాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాల ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) పెంపుదలను ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. ప్రస్తుతం 24 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలులో ఉంటోన్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించిన జీఓ 2022 జనవరి 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొలిసారిగా విడుదల చేసింది. ఈ జీవో 2025 జూన్ 30వ తేదీ నాటిెకి ముగియాల్సి ఉంది. ఇప్పుడీ ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది.
ఈ ఏడాది జులై 1 నుండి జూన్ 30, 2026 వరకు ఈ పెంపుదల అమలులో ఉంటుంది. ఆ తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం దీన్ని పొడిగించాలా? వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటుంది. 11వ పీఆర్‌సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం 2022లో కొత్త వేతన సవరణలను అమలు చేసిన విషయం తెలిసిందే.
దాని ప్రకారం- సచివాలయం, హెచ్‌ఓడీ ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏను 24 శాతానికి పెంచింది. గరిష్ట పరిమితిని 25,000 రూపాయలుగా నిర్ణయించింది. ఈ అలవెన్స్ మొదట జనవరి 1, 2022 నుండి జూన్ 2024 వరకు అమలులో ఉంది. తరువాత, దీనిని జూన్ 30, 2025 వరకు పొడిగించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పుడు ఇదే 25,000 రూపాయల హెచ్ఆర్ఏ.. మరో ఏడాది పాటు సచివాలయం, వివిధ శాఖలు, విభాగాధిపతుల (హెచ్‌ఓడీ) కార్యాలయాల ఉద్యోగులకు అందుతుంది. ఉద్యోగుల సంఘాల విజ్ఞప్తి మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వారి వినతుల పట్ల సానుకూలంగా స్పందించింది.
12వ పీఆర్‌సీ సిఫార్సులు వెలువడే వరకు హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పొడిగింపుతో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం కలగనుంది.
































