బాలీవుడ్ స్టార్‌హీరో సల్మాన్ ఖాన్‌కి హైదరాబాద్ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అతడు తన గారాల సోదరి అర్పితాఖాన్ పెళ్లి వేడుకను హైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ లో అత్యంత వైభవంగా జరిపించారు.
ఆయన జీవితంలో ఏ ముఖ్య కార్యక్రమానికి అయినా ఫలక్ నుమా ప్యాలెస్ లో వేడుకలను జరుపుకునేందుకు హైదరాబాద్ ని డెస్టినేషన్ సిటీగా మార్చుకుంటారు.
భాయ్ హైదరాబాద్ తో అనుబంధం కొనసాగించడం ఇప్పటివరకూ ఒకెత్తు అనుకుంటే, ఇప్పుడు మరొక ఎత్తు. సల్మాన్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కీలక ఎంవోయు కుదుర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది హైదరాబాద్ వినోదపరిశ్రమలో ఒక కీలక పరిణామం కానుంది. సల్మాన్ భాయ్ ఒక భారీ ఫిలింస్టూడియోని నిర్మించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి చర్చించారని తెలుస్తోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 50 నుంచి 60 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధమవుతోందని సమాచారం.
సల్మాన్ హైదరాబాద్ సమీపంలోని `భారత్ ఫ్యూచర్ సిటీ`లో ఫిల్మ్ స్టూడియోను నిర్మించేందుకు అన్నివిధాలా ప్రభుత్వ సహకారం అందనుంది. ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలులో రాయితీలు కూడా దక్కనున్నాయి.
డిసెంబర్ 8, డిసెంబర్ 9 తేదీలలో తెలంగాణలో జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఆస్కారం ఉందని కథనాలొస్తున్నాయి. కందుకూరు మండలం మిర్ఖాన్‌పేటలో భారత్ ఫ్యూచర్ సిటీలో రెండు ప్రధాన ప్రాజెక్టులకు రేవంత్ రెడ్డి పునాది రాళ్ళు వేశారు. ఆ తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగవంతమైందని తెలుస్తోంది. ఇలాంటి చోట సల్మాన్ ఖాన్ ఫిలింస్టూడియోని నిర్మిస్తే ఆ ప్రాంతానికి కొత్త కళ వస్తుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో స్టూడియో పనులు వేగంగా పూర్తయ్యేందుకు కూడా ఆస్కారం ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్ నగరానికి తలమానికం అయిన రామోజీ ఫిలింసిటీ ఒకెత్తు అనుకుంటే, ఇప్పటికే రామానాయుడు ఫిలింస్టూడియో, అన్నపూర్ణ స్టూడియోస్, సారథి స్టూడియోస్ వంటి స్టూడియోలు సినిమాల షూటింగులకు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటినీ మించేలా సల్మాన్ భాయ్ భారీ స్టూడియో నిర్మాణానికి ప్రయత్నించడం ఆసక్తికర చర్చకు తెర తీస్తోంది. ఒకే చోట అన్ని వసతులతో సకల సాంకేతిక ఏర్పాట్లతో నిర్మాతలకు పని పూర్తయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.




































